TTD on Kiosk Machines to Laddu : తిరుమల లడ్డూ కౌంటర్లలో రద్దీని, అధిక సమయాన్ని తగ్గించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు కియోస్క్‌ల ద్వారా భక్తులు లడ్డూ టికెట్లు తీసుకునే విధానాన్ని తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానాన్ని ఆదివారం నాడు ప్రారంభించింది. వాస్తవానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం అదనంగా పొందాలనుకునే భక్తులు లడ్డూ విక్రయ కేంద్రంలో నగదు చెల్లించి కొనుగోలు చేయాలి. ఈ ప్రక్రియకు అధిక సమయం పట్టడంతో పాటు కొన్నిసార్లు రద్దీ కూడా పెరుగుతుంది.
ఇప్పుడు వీటిని నియంత్రించేందుకు కియోస్క్‌ల ద్వారా లడ్డూలను కొనుగోలు చేసే విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చింది. భక్తుడు తన దర్శన టికెట్ నంబర్‌ను కియోస్క్‌లో నమోదు చేసుకోవాలి. తనకు కావాల్సిన లడ్డూల సంఖ్యను ఎంపిక చేసుకుని యూపీఐ ద్వారా నగదు చెల్లించాలి. అనంతరం వచ్చిన రసీదును లడ్డూ కౌంటర్‌లో ఇస్తే అక్కడ లడ్డూలను అందిస్తారు. దర్శన టికెట్లు లేని భక్తులు ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి రెండు లడ్డూలను కొనుగోలు చేయవచ్చు. ఆ సంఖ్యను నాలుగుకు పెంచేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ మేరకు లడ్డూ విక్రయ కేంద్రంలో కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఐదు కియోస్క్‌లు ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేశారు. వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు పొందే ఎంబీసీ విచారణ కేంద్రం వద్ద మరో మూడింటిని ఏర్పాటుచేశారు. తిరుమల వ్యాప్తంగా శ్రీపద్మావతి విచారణ కేంద్రం, సీఆర్వో విచారణ కేంద్రం, ప్రముఖ అతిథిగృహాల వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను కూడా కియోస్క్‌ల ద్వారా పొందేలా చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే ఈ విధానం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
Free Travel For Devotees in Tirumala : మరోవైపు నాలుగు రోజుల క్రితమే తిరుమల శ్రీవారి వద్దకు భక్తులను చేర్చడానికి ఉచితంగా బస్సు సేవలు అందుబాటులోకి తెచ్చింది. తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీతో కలిసి ఉచిత సర్వీసులను టీటీడీ తీసుకొచ్చింది. శ్రీవారి ధర్మరథాలు తిరిగే మార్గంలోనే ఆర్టీసీ బస్సులూ సేవలు అందిస్తాయి. సగటున మూడు-నాలుగు నిమిషాలకో బస్సు ప్రతి స్టాప్‌లో భక్తులకు అందుబాటులో ఉండనుంది.
శ్రీవారి భక్తుల రక్షణకు స్మార్ట్ స్టిక్స్ - ఆన్‌చేస్తే జంతువులు పరార్!
తిరుమల భక్తులకు అలర్ట్ - సెప్టెంబర్ కోటా శ్రీవారి దర్శనం, గదుల టికెట్ల షెడ్యూల్ ఇదే!