Krishna Canal Become Worse Due To Negligence Of Authorities : అది కృష్ణాడెల్టా శివారు ఆయకట్టుకు సాగునీరందించే ప్రధాన కాలువ. నగర జనాభాకు తాగునీటి అవసరాలు తీర్చే మార్గం.! కొన్నేళ్లుగా ఆ కాలువలో నీటి లభ్యత తగ్గడం, అధికారులు పట్టించుకోకపోవటంతో కాలువ స్వరూపమే మారిపోయింది. ప్రస్తుత పరిస్థితి చూస్తే మాత్రం ఈ నీరు తాగగలరా అనే సందేహం వ్యక్తం అవుతోంది.
కనుచూపుమేరలో గుర్రపు డెక్క, చెత్తాచెదారాలు, మురుగుతో నిండిపోయిన ఇది, విజయవాడ నడిబొడ్డు నుంచి ఏలూరు నగరానికి వచ్చే కృష్ణా కాలువ. విజయవాడ శివారులో సుమారు 50వేల ఎకరాల ఆయకట్టు ఈ కాలువ ద్వారా వచ్చే నీటిపైనే ఆధారపడి సాగవుతోంది. ఏలూరు నగర ప్రజలకు తాగునీరు అందించే ప్రధాన కాలువ కూడా ఇదే.
కాలుష్యంతో మురుగు డ్రైన్ : కొన్నేళ్లుగా ఈ కాలువకు నీటి ప్రవాహం అంతంతమాత్రంగానే ఉంది. పట్టిసీమకు అనుసంధానంగా ఉన్న కాలువలోకి గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీ నుంచి వదిలితే తప్ప సాధారణ రోజుల్లోనూ నీటి ప్రవాహం కనిపించదు. అలా ఏటా ఈ కాలువ ప్రాముఖ్యత తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలోనే కాలుష్య కాసారంగా మారిపోయింది. అటు విజయవాడ నుంచి వచ్చే వ్యర్థాలు, పరిశ్రమల నుంచి హానికర రసాయనాలు, ఏలూరు నగర వ్యర్థాలు నేరుగా కాలువలోనే కలుస్తున్నాయి. నగరంలోని చెత్తాచెదారాలూ ఇందులోనే పడేస్తున్నారు. ఒకప్పుడు జలరవాణా జరిగిన ఈ కాలువ కాలుష్యంతో మురుగు డ్రైన్‌ను తలపిస్తోంది.
ఎలాంటి చర్యలు లేవు : ఏలూరు నగరంలోని పంపుల చెరువుకు ఈ నీటిని ఎత్తిపోసి అక్కడ శుద్ధి చేసి ఆ నీటిని నగర వాసులకు ఉదయం, సాయంత్రం వేళల్లో అందించే వారు. ప్రస్తుత వేసవిలో ఆ పరిస్ధితి లేదు. కాలువలో చుక్క నీరులేని పరిస్థితి. కాలువను ఆధునికీకరించే అవకాశం ఉన్నా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి.
ఎవరికివారే గాలికి : జిల్లాలు మారినా ఇప్పటికీ కాలువ నిర్వహణ బాధ్యత కృష్ణా జిల్లా జలవనరులశాఖ పరిధిలోకి ఉండడంతో అటు వారు, ఇటు ఏలూరు జిల్లా అధికారులు ఎవరికివారే గాలికి వదిలేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువను ఆధునికీకరించి సాగు, తాగునీటి సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
కళ్లు తిరిగి కాలువలో పడిపోయిన వ్యాపారి - మూడు రోజులుగా చెత్తలోనే
లోకేశ్ చొరవతో పెదవడ్లపూడి ప్రాజెక్టు పూర్తి - 26 వేల ఎకరాలకు సాగునీరు