Brothers Got Job In Google: రైతు కుటుంబానికి చెందిన ఆ ఇద్దరు అన్నదమ్ములకు చదువంటే ఎంతో ఇష్టం. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ చదువులో దూసుకువెళుతున్నారు. పుస్తకాలపై మక్కువ చూసి తల్లిదండ్రులు వారి కలలను నెరవేర్చేందుకు ఎంతో కృషి చేశారు. పాతికేళ్లలోపే చదువు పూర్తి చేసిన రెండేళ్ల వ్యవధిలో గూగుల్ కంపెనీలో భారీ ప్యాకేజీ సాధించారు.
ప్రణాళిక ప్రకారం: వీరిది డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అచ్యుతాపురం గ్రామం. పాలచర్ల అమ్మిరాజు, సునీత వీరి తల్లిదండ్రులు. తండ్రి సొసైటీలో చిన్న ఉద్యోగం చేస్తారు. వీరికి శ్రీవినోద్, శ్రీసత్య నవీన్ ఇద్దరు కుమారులు. వీరిద్దరూ ఉన్నత కొలువులు సాధించాలన్న ఆశతో దిశ నిర్దేశించుకొని ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం ముందుకు సాగారు.
ఇద్దరివీ భారీ ప్యాకేజీలే: ఏదో సాధించాలి, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నారు. వారి కలలను సాధించుకునేందుకు తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. అందుకు తగ్గ ఫలితాన్ని ఇద్దరూ అందుకున్నారు. శ్రీవినోద్ గూగుల్ సంస్థలో ఏడాదికి రూ.50 లక్షల ప్యాకేజీకి 2023లో ఎంపికవగా, అన్నను స్ఫూర్తిగా తీసుకున్న శ్రీసత్యనవీన్ తాజాగా అదే సంస్థలో రూ.44 లక్షల ప్యాకేజీతో సెలక్ట్ అవ్వడం విశేషం.
జేఈఈ మెయిన్స్‌లో 1924వ ర్యాంకు సాధించారు నవీన్. వరంగల్ నిట్‌లో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) 2021లో పూర్తి చేశారు. టెక్నికల్ స్కిల్స్‌కు పదునుపెడుతూ ఏటా ఆ డిపార్ట్మెంట్లో టాపర్‌గా రాణించారు. నాలుగో ఏడాది ఎన్ఐటీ క్యాంపస్ సీఎస్ విభాగం నుంచి 900 మందిలో అత్యుత్తమ ప్రతిభ చూపి గోల్డ్ మెడల్ అందుకున్నారు. క్యాంపస్ సెలక్షన్లో గూగుల్ సంస్థకు ఏడాదికి రూ.44 లక్షల ప్యాకేజీకి ఎంపికయ్యారు. వచ్చే నెలలో జాబ్‌లో చేరేందుకు నవీన్ సిద్ధమవుతున్నారు.
ఉద్యోగం సాధించాలంటే చదువుతోపాటు నైపుణ్యాలు అంతే అవసరం. ప్రతిష్ఠాత్మక సంస్థల్లో కొలువులు సాధించాలంటే కోడింగ్‌పై పట్టు, వేగం అవసరం. నేను లీట్‌కోడ్, గీక్స్‌ఫర్గీక్స్ వెబ్‌సైట్స్‌లో అభ్యాసన చేయడం ద్వారా కోడింగ్‌పై పట్టు సాధించాను. అన్నయ్య అప్పటికే గూగుల్‌లో పని చేస్తున్నందున సందేహాలను నివృత్తి చేసకుంటూ ముందుకుసాగాను. అయిదు రౌండ్లలో జరిగిన ముఖాముఖిలో అన్ని విభాగాల్లో ప్రతిభ చూపడంతో క్యాంపస్ నుంచి ఆ సమయంలో అయిదుగురు ఎంపికవ్వగా స్టేట్ నుంచి నేన్కొడినే ఉన్నా. చిన్నప్పటి నుంచి అమ్మ మాపై ఎంతో శ్రద్ధ చూపించడంతోపాటు, చదువులో రాణించేందుకు రోజూవారీ టైమ్‌టేబుల్‌ను రూపొందించేవారు. చదువు, ఆటల్లో మా ఇష్టాలను ప్రోత్సహిస్తూ లక్ష్యాలను గుర్తు చేస్తూ గూగుల్ సంస్థ వైపు నడిపించారు. అమ్మనాన్నలను జీవితాతం ఏ లోటూ లేకుండా చూసుకోవడమే మా ఇద్దరి లక్ష్యం - శ్రీసత్య నవీన్
డిగ్రీ లేకున్నా ఉద్యోగాలు.. గూగుల్, IBMలోనూ ఛాన్స్.. విమానాలూ నడపొచ్చు!
Google Jobs: గూగుల్ సంస్థలో ఆ జంతువుకు ఉద్యోగం.. ఎందుకంటే?