సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టయ్యారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసం వద్ద కొమ్మినేనిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ఆయన్ని అమరావతికి తీసుకొస్తున్నారు. రాజధాని రైతులు, మహిళల ఫిర్యాదుతో కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. రాష్ట్ర మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజధాని మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై సాక్షి జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజుపై కేసులు నమోదయ్యాయి. కృష్ణంరాజు, కొమ్మినేనితోపాటు సాక్షి యాజమాన్యంపైనా ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ సహా ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అమరావతిలో ఉన్న తాడికొండ ఎస్సీ నియోజకవర్గం కావడంతో దళిత మహిళలను అవమానపరిచారన్న ఫిర్యాదుతో SC-ST కేసు నమోదుచేశారు. ఈ క్రమంలో సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును గుంటూరు పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసి రాష్ట్రానికి తరలిస్తున్నారు. సాక్షి ఛానల్‌లో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించే చర్చా కార్యక్రమంలో పాత్రికేయుడు కృష్ణంరాజు అమరావతి మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి మహిళలను కించపరిచిన 'సాక్షి' - వరుస ఫిర్యాదులు
ఈ వ్యాఖ్యలను ఖండించకుండా, కొమ్మినేని శ్రీనివాసరావు చర్చను కొనసాగించారు. కృష్ణంరాజు వ్యాఖ్యలను కానీ, కొమ్మినేని తీరును ఖండిస్తూ కానీ, సాక్షి యాజమాన్యం సరైన వివరణ ఇవ్వలేదు. ఈ క్రమంలో అమరావతి మహిళలు, ప్రజాసంఘాలు, పాత్రికేయ సంఘాలు కూడా పోలీసులకు అనేక మంది ఫిర్యాదులు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
'సాక్షి' ఛానల్ జర్నలిస్ట్‌పై కేసు నమోదు చేయాలి - డీజీపీకి రఘురామ రాజు లేఖ
మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు : సీఎం చంద్రబాబు