Kommineni Srinivasa Rao Remand: సాక్షి ఛానల్ చర్చలో అమరావతి ప్రాంతంపై, అక్కడి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టయిన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు జూన్ 24 వరకు మంగళగిరి కోర్టు రిమాండ్ విధించింది. సాక్షి టీవీలో అసభ్య వ్యాఖ్యలపై మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదుతో తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1గా కృష్ణంరాజు, ఏ2గా కొమ్మినేని శ్రీనివాసరావు, ఏ3గా సాక్షి టీవీ యాజమాన్యాన్ని పేర్కొన్నారు.
సోమవారం హైదరాబాద్‌లో కొమ్మినేనిని అరెస్టు చేసి గుంటూరు నల్లపాడు తరలించారు. మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఛానల్‌లో జరిగిన చర్చకు సంబంధించిన వీడియోలను న్యాయమూర్తి ఎదుట ప్రదర్శించారు. రిమాండ్ విధించాలని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే కొమ్మినేనిపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సెక్షన్లను న్యాయమూర్తి తొలగించారు. ఈ వ్యవహారంలో ఆ సెక్షన్లు వర్తించవన్నారు. అనంతరం కోర్టు కొమ్మినేనికి రిమాండ్ విధించింది.
ఆ విషయాలు నాకు బాగా తెలుసు: అయితే కొమ్మినేని తరపున వాదనలు వినిపించిన మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి రిమాండ్ సరికాదన్నారు. ఆర్నాబ్ గోస్వామి కేసుని ప్రస్తావించారు. ఆ కేసు వివరాలు సమర్పించాలని న్యాయమూర్తి కోరగా సమయం అడిగారు. మధ్యాహ్న భోజనం తర్వాత మరోసారి కోర్టులో వాదనలు జరిగాయి. మహాభారతంలోని అంశాలను పొన్నవోలు ప్రస్తావించగా తాను వైదిక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చానని, పురాణాలు మీకన్నా ఎక్కువ తెలుసని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పొన్నవోలు వాదనల్ని తోసిపుచ్చిన న్యాయస్థానం కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించింది.
బెయిల్ కోసం అక్కడికే వెళ్లండి: బెయిల్ పిటిషన్‌కు అనుమతి ఇవ్వాలని పొన్నవోలు కోరగా హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తున్నట్లు టీవీల్లో వేస్తున్నారు. బెయిల్ కోసం అక్కడికే వెళ్లండని చెప్పారు. గుంటూరు జిల్లా జైలుకు కేఎస్ఆర్‌ను తరలించాలని ఆదేశించింది. తనకు 70ఏళ్లు దాటాయని కింద పడుకోలేనని, పరుపు, దిండు సౌకర్యాలు కల్పించాలని కొమ్మినేని కోర్టుకు విన్నవించారు. ప్రస్తుతం మనుషుల సగటు ఆయుర్థాయం పెరిగిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఎవరు ఎక్కడ ఉండాలో దేవుడు నిర్ణయిస్తారని, ఆ చోటుకు వెళ్లటమే మనం చేయాల్సిన పని అన్నారు. జైలు నియమావళి ప్రకారం ఏ సౌకర్యాలకు అర్హులో ఆ సౌకర్యాలు తప్పకుండా కల్పించాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల ప్రకారం కొమ్మినేనిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
భారీ బందోబస్తు మధ్య: కొమ్మినేనిని కోర్టుకు తీసుకొస్తుండగా మంగళగిరి న్యాయస్థానం పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. రాజధాని రైతులు, మహిళలు, దళిత సంఘాల వారు ఆయన్ను అడ్డుకునే అవకాశం ఉందని భావించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అమరావతి ప్రాంత మహిళలు, ఈ వ్యహారంలో ఫిర్యాదు చేసిన వారు కోర్టు వద్దకు వచ్చారు. కొమ్మినేనికి రిమాండ్ విధిస్తూ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కృష్ణంరాజుని కూడా పోలీసులు త్వరగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
మూత్రనాళంలో ఇన్‌ఫెక్షన్: కోర్టులో హాజరు పర్చేందుకు ముందు కొమ్మినేనికి గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఆయనకు బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. అయితే తనకు గుండెల్లో అలజడిగా ఉందని, మూత్రం సరిగా రావటం లేదని కొమ్మినేని వైద్యులకు చెప్పారు. దీంతో గుండెకు సంబంధించి 2డీ ఎకో పరీక్ష చేశారు. అంతా బాగానే ఉన్నట్లు తేలింది. మూత్రపిండాల వైద్య నిపుణులు ఆయనకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహించారు. మూత్రనాళంలో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించి తగ్గేందుకు అవసరమైన మందులు అందజేశారు.
కొమ్మినేని శ్రీనివాసరావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు:
ప్రణాళిక ప్రకారమే దురుద్దేశంతో వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యల వెనుక ఉన్న కుట్రను ఛేదించాలి. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే అమరావతిపై నిందలు మోపారని వెల్లడి. అసభ్య వ్యాఖ్యలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంది. సమాజంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే ఇలా చేశారని భావిస్తున్నాం. సాక్షి టీవీ డిబేట్‌లో కొమ్మినేని ఆధ్వర్యంలోనే జరిగిన డిబేట్‌లో వీవీఆర్ కృష్ణంరాజు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అసభ్య వ్యాఖ్యలను ఖండించకుండా కొమ్మినేని సమర్థిస్తూ మాట్లాడారు. కృష్ణంరాజును పరోక్షంగా కొమ్మినేని ప్రోత్సహించారు. కొమ్మినేనిని ప్రశ్నిస్తే అన్నీ బయటకు వస్తాయి. విచారణలో కొమ్మినేని సహకరించలేదు. దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించేలా జవాబులు చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భగ్నం కలిగించే వ్యాఖ్యలు చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావును రిమాండ్‌కు ఇవ్వాలి. కేసులో సాక్షులను విచారించాల్సి ఉంది. -రిమాండ్ రిపోర్టులో పోలీసులు
రాత్రంతా పోలీస్ స్టేషన్‌లోనే కొమ్మినేని - నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు