kommineni Srinivasa Rao Arrest: రాజధాని అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన కొమ్మినేని శ్రీనివాసరావును గుంటూరులోని నల్లపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. రాజధాని మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీషా ఫిర్యాదు మేరకు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు, సాక్షి టీవీ యాజమాన్యంపై తుళ్లూరులో కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కొమ్మినేని అరెస్ట్ చేసిన పోలీసులు నల్లపాడు స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఇవాళ మంగళగిరి కోర్టులో హాజరుపర్చనున్నారు.
సాక్షి ఛానెల్‌లో చర్చ సందర్భంగా రాజధాని అమరావతి మహిళల పట్ల అసభ్య వ్యాఖ్యలపై రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతిలో ఉన్న తాడికొండ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలోని దళిత మహిళలను అవమానించారన్న ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద కేసు పెట్టారు. సాక్షి యాజమాన్యంపైనా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కొమ్మినేని శ్రీనివాసరావును తుళ్లూరు పోలీసులు హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడ మీదుగా గుంటూరులోని నల్లపాడు స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనకు సంబంధించి రాజధాని అమరావతిలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు చేయడం, సాక్షి కార్యాలయాల వద్ద ఆందోళన చేయడంతో కొమ్మినేని తరలింపులో అప్రమత్తంగా వ్యవహరించారు. తుళ్లూరు స్టేషన్‌కు తీసుకెళ్తే అవాంఛనీయ ఘటనలు జరిగే ప్రమాదం ఉండటంతో విజయవాడ స్టేషన్‌కు తీసుకెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు. ఆందోళనల దృష్ట్యా దీన్ని విరమించుకున్నారు. విజయవాడ, మంగళగిరి, గుంటూరు, నల్లపాడు స్టేషన్‌లలో ఎక్కడా భద్రత ఉంటుందనే అంశంపై పోలీసులు అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. ఎట్టకేలకు రాత్రి 10 గంటల ప్రాంతంలో నల్లపాడు స్టేషన్‌కు తరలించారు.
కొమ్మినేని శ్రీనివాసరావును నల్లపాడు స్టేషన్‌కు తీసుకువస్తారనే సమాచారంతో మీడియా అక్కడకు చేరుకుంది. అయితే రాత్రి 10 గంటల సమయంలో మీడియా కంట పడకుండా పోలీసు వాహనంలో కాకుండా కిటీలకు నల్లటి కవరు ఉన్నమాములు వాహనంలో స్టేషన్ ముందు నుంచి కాకుండా వెనుక మార్గం నుంచి లోనికి తీసుకెళ్లారు. రాత్రంతా నల్లపాడు స్టేషన్‌లోనే కొమ్మినేనిని ఉంచిన పోలీసులు ఇవాళ మంగళగిరి కోర్టులో హాజరుపర్చనున్నారు.
అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మరో నిందితుడు: ఈ కేసులో మరో నిందితుడు కృష్ణంరాజుపై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విజయవాడ అయోధ్య నగర్ కాలనీలోని ఇంటికి తాళం వేసి కృష్ణంరాజు పరారయ్యారు. ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. అసభ్య వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్‌స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యాయి.