A poor Family Waiting For Help : అభంశుభం తెలియని ఆ బాలుడికి అనారోగ్యం రూపంలో పెద్ద ఆపదే వచ్చిపడింది. తోటి పిల్లలతో ఆటపాటలతో హాయిగా గడపాల్సిన వయసులో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాడు. చిన్నారి బతకాలంటే కాలేయ మార్పిడి సర్జరీ తప్పనిసరని, ఇందుకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పటంతో బాలుడి తల్లి ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తోంది.
చిన్న వయసులోనే చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు : ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన టి.రమేష్, మాధవీలత దంపతులకు 2008లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. 2012లో రెండో సంతానంగా పుట్టిన దినేశ్‌కు 8 ఏళ్ల ప్రాయంలోనే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కుమారుడిని ఎలాగైనా బతికించుకోవాలని ఖమ్మం, హైదరాబాద్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు. కొన్ని రోజుల తర్వాత వైద్యం విషయంలో మనస్పర్థలు రావడంతో భార్యాభర్తలు విడిపోయారు. మాధవీలత తన పిల్లలను తీసుకుని కల్లూరులోనే తల్లిదండ్రుల వద్దకు చేరింది. కుమారుడిని కాపాడుకోవడానికి అప్పులు చేసి, స్థానికుల సహకారంతో దాదాపు రూ.7 లక్షల వరకు ఖర్చు చేసింది. నాటినుంచి మందులను వాడుతూనే ఉంది.
జన్యు సంబంధిత వ్యాధితో : కల్లూరులోనే 8వ తరగతి చదువుతున్న దినేశ్‌కు గాయమైనా, దెబ్బలు తగిలినా, ఎవరైనా కొట్టినా రక్తం గడ్డకట్టుకుపోతుంది. అధిక సమయం కూర్చోలేడు. నడవలేడు. జన్యు సంబంధిత వ్యాధిగా నిర్ధారించిన డాక్టర్లు, జీవిత కాలం మందులు వాడాలని సూచించారు. ఇదే సమయంలో అతని కాలేయం పాడైందని మార్పిడి (ట్రాన్స్‌ప్లాంట్) చేయించుకోవాలని తెలిపారు.
కాలేయ దానానికి సిద్ధమైనప్పటికీ : కిరాణా దుకాణంలో గుమస్తాగా పని చేసే మాధవీలతకు నెలకు రూ.6 వేలు వస్తోంది. ఆ సొమ్ము కుమారుని మెడిసిన్‌కే చాలక కుటుంబ సభ్యులపై ఆధారపడుతోంది. తల్లి తన కాలేయాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చింది. మెడికల్ టెస్ట్‌లో అనుకూల ఫలితం వస్తే లివర్ మార్పిడికి రూ.10 లక్షలు వరకు ఖర్చు అవుతుందని, ఇతరుల నుంచి సేకరించి చేయాలంటే రూ.25 లక్షలవుతుందని తెలిపారు. కాలేయం మార్పిడి చేయకుంటే తన బిడ్డ ప్రాణానికే ముప్పని, దయార్ధ్ర హృదయులు స్పందించి తన కుమారుణ్ని బతికించాలని ఆమె వేడుకుంటోంది. దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నంబరు : 9394450050
సాయం చేస్తే సంపూర్ణ జీవితం - 15 ఏళ్ల బాలుడి గుండె మార్పిడికి సాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు
'అమ్మా అనలేదు - ఆకలేసినా చెప్పలేదు' - అంతుచిక్కని వ్యాధితో బాలిక నరకయాతన