Flight Services from Visakha Cancelled: రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖకు విమాన రాకపోకలు క్రమంగా తగ్గుతున్నాయి. ఆర్థిక, ఐటీ, టూరిజం, ఫార్మా రంగాలకు అనువుగా అభివృద్ధి చెందుతున్న విశాఖకు విమాన సర్వీసులు ఒక్కొక్కటిగా రద్దవుతున్నాయి. కొత్త సర్వీసులు రావలసిన మాట అలా ఉంచితే ఉన్నవాటినే తీసేయడం వెనుక మర్మం అంతు చిక్కడం లేదు. ప్రయాణికుల మీదే ఆధారపడుతున్నందునే ఈ పరిస్థితి వచ్చిందని వివిధ దేశాలకు కార్గో సేవలు పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
విశాఖ నుంచి ఇంతకుముందు ఐదు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉండేవి. దుబాయ్, సింగపూర్, మలేసియా, శ్రీలంక, బ్యాంకాక్‌కు వీటిని నడిపేవారు. కరోనా సమయంలో అవన్నీ ఆగిపోయాయి. తర్వాత సింగపూర్, మలేసియా, బ్యాంకాక్ సర్వీసులను పునరుద్ధరించారు. దుబాయ్ విమానం వస్తుందని పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. అది నెరవేరక ముందే ప్రస్తుతం ఉన్న మూడు సర్వీసుల్లో రెండింటికి బుకింగ్స్ నిలిచిపోయాయి. మే 1వ తేదీ నుంచి మలేసియా, బ్యాంకాక్ సర్వీసులు నడపడం లేదని ఎయిర్ ఏసియా ప్రకటించింది. ఇక విశాఖకు ఒకే ఒక అంతర్జాతీయ సర్వీస్ సింగపూర్ విమాన రాకపోకలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులున్న వస్తున్న నేపథ్యంలో ఈ సర్వీసులపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు సూచిస్తున్నారు.
విజయవాడలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ - రూ.350 కోట్లతో 4 రోడ్ల విస్తరణ
విశాఖకు పారిశ్రామిక నగరంగా బ్రాండ్ ఇమేజ్ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక అది మరింత పెరిగింది. ఇటు చూస్తే అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న కారణంగా జనవరిలో కౌలాలంపూర్ సర్వీసును నిలిపివేయాలని ఆ సంస్థ భావించగా కేంద్ర మంత్రి చొరవతో సేవలు కొనసాగించారు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 74.4 శాతం పెరిగింది. 8,415 మంది మలేసియా, సింగపూర్‌కు రాకపోకలు సాగించారు. అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోతే వారంతా హైదరాబాద్, చెన్నై వెళ్లి అక్కడి నుంచి బ్యాంకాక్, మలేసియాలకు ప్రయాణించాల్సి ఉంటుంది.
విజయవాడకు ఒక్కటే సర్వీసు: విశాఖ, విజయవాడ మధ్య రాకపోకలు పెరిగిన తరుణంలో గతేడాది అక్టోబరులో రెండు కొత్త సర్వీసులు ప్రారంభించారు. విజయవాడ వెళ్లేందుకు ఉదయం రెండు, సాయంత్రం ఒక సర్వీసు అందుబాటులో ఉండేవి. తాజాగా ఉదయం సర్వీసులు రద్దయ్యాయి. ఉమ్మడి విశాఖతోపాటు తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలకు విశాఖ విమానాశ్రయమే దిక్కుగా మారింది. భోగాపురం విమానాశ్రయం పెద్ద గేమ్ ఛేంజర్‌గా భావిస్తుంటే ఇప్పుడు ఈ తరహాలో సర్వీసులు రద్దు మాత్రం తిరోగమన చర్యగా నిపుణులు భావిస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్దే చర్యలు అవసరమని చెబుతున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ వెలుగులు - తొలిదశలో 147 చోట్ల ఏర్పాటు