Kasireddy Rajasekhar Reddy Not Appear for SIT Investigation: మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మరోసారి గైర్హాజరయ్యారు. సిట్ తాఖీదులు బేఖాతరు చేస్తూ ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని పరారీలో ఉన్నారు. ఇతనికి గత ప్రభుత్వ హయాంలో కీలక పోస్టులో పని చేసే ఓ ఐపీఎస్ అధికారి తెరవెనక ఉండి సాయం చేస్తున్నట్లు సమాచారం.
వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మరోసారి సిట్ విచారణకు డుమ్మా కొట్టారు. వరుసగా మూడోసారి సిట్ నోటీసులు బేఖాతరు చేస్తూ విచారణకు హాజరుకాకుండా పరారయ్యారు. ఇదే కేసులో మార్చి 28, 29 తేదీల్లో ఆయనకు సిట్ వరుసగా రెండుసార్లు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలని ఆదేశించినా కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పట్టించుకోలేదు. అప్పటి ప్రభుత్వంలో తాను ఐటీరంగ సలహాదారుగా పని చేశానని, మద్యం కేసులతో తనకు సంబంధమేంటని అడ్డగోలుగా వాదిస్తూ సిట్ అధికారులకు ఆయన మెయిల్ పంపించి విచారణకు హాజరు కాలేదు.
ఈ కేసులో తనకు ఏ ప్రాతిపదికన నోటీసులు ఇచ్చారో తెలపాలంటూ ఎదురు ప్రశ్నించారు. సిట్ నోటీసులు సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఈ కేసులో తాము జోక్యం చేసుకోబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కసిరెడ్డికి తగినంత సమయం ఇస్తూ ఏప్రిల్ 9న విచారణకు రావాలంటూ ఈనెల 5న మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ నోటీసులను బేఖాతరు చేస్తూ ఆయన మరోసారి విచారణకు గైర్హాజరు కావడమే గాక, ఫోన్ స్విచ్ఛాప్ చేసి పరారయ్యారు.
ఆయన సూచనలతోనే పరారీలో రాజ్ కసిరెడ్డి: వైఎస్సార్సీపీ హయాంలో అత్యంత కీలకమైన పోస్టు దక్కించుకున్న ఓ ఐపీఎస్ అధికారే కసిరెడ్డికి తెరవెనక సాయం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ప్రతిపక్షనేత చంద్రబాబు సహా టీడీపీ కీలక నేతలపై అక్రమ కేసుల బనాయింపులు, అరెస్టుల్లో మాస్టర్ మైండ్‌గా ఈ అధికారే వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఈ అధికారి విజయవాడ దాటి వెళ్లకూడదన్న నిబంధనలు ఉన్నా సరే, హైదరాబాద్‌లో మకాం వేసి ఈ పనుల్లోనే తలమునకలై ఉంటున్నారు. సిట్ నోటీసులకు ఎలా స్పందించాలి? వారికి చిక్కకుండా ఎలా తప్పించుకోవాలి? అజ్ఞాతంలో ఎలా గడపాలి వంటి అంశాలపై ఆ ఐపీఎస్ అధికారే కసిరెడ్డికి మార్గనిర్దేశం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆయన సూచనలతోనే రాజ్ కసిరెడ్డి పరారీలో ఉన్నట్లు సమాచారం.
జగన్ హయాంలో ప్రభుత్వ పెద్దలకు లంచాలు చెల్లించేందుకు అంగీకరించిన వారికే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టడం, వారి నుంచి ముడుపులు వసూలు చేయడం వంటివన్నీ కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డే చూసుకునే వారని సిట్ దర్యాప్తులో తేలింది. కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని ప్రశ్నిస్తే ఈ లంచాల సొమ్ము అంతిమంగా ఎవరికి చేరిందో బయటకొచ్చే అవకాశముంది. అందుకే ఆయన సిట్ చేతికి చిక్కకుండా వైఎస్సార్సీపీ పెద్దలు, ఐపీఎస్ అధికారి అజ్ఞాతంలోకి పంపినట్లు సమాచారం.
ఐటీ సలహాదారుగా పనిచేసిన తనకు ఎక్సైజ్ కేసుతో సంబంధమేంటి?: రాజ్ కసిరెడ్డి రివర్స్ జిత్తులు
ఎంపీ మిథున్‌రెడ్డికి బిగ్ షాక్ - ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు