Vijayawada Fake Marriage Case : వివాహ సంబంధం కుదుర్చుకోవాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలనేది ఒకప్పటి మాట. నేడు ఓ వైపు టెక్నాలజీ పుణ్యమా అని ఆన్లైన్లోనే సంబంధాలు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు మ్యారేజ్ బ్యూరోలు, మధ్యవర్తుల ద్వారా పెళ్లిళ్లు కుదుర్చుకుంటున్నారు. మరి అసలు సమస్య ఇక్కడే ఎదురవుతోంది. తాజాగా ఓ ముఠా వయసు మీరిన వరులే లక్ష్యంగా గాలం వేస్తోంది. తమను సంప్రదించిన వారిని మాటల్లోకి దింపి వారి దగ్గర నుంచి అందినకాడికి దోచుకుంటోంది.
తాజాగా వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న మహిళను మధ్యవర్తులు పెళ్లికాని అమ్మాయిగా నమ్మించి ఓ వ్యక్తితో వివాహం జరిపించారు. ఆ తర్వాత నవ వధువు భర్తను దూరం పెడుతోంది. దీంతో వరుడి కుటుంబ సభ్యులు ఆమె నిలదీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు పెళ్లి కుమారుడు నుంచే రూ.4 లక్షలు కట్నంగా వారు తీసుకున్నారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన విజయవాడ కృష్ణలంకలో చోటు చేసుకుంది.
దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కర్ణాటకలోని గంగావతిలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన ఓ యువకుడికి 34 సంవత్సరాలు వచ్చినా వివాహం కాలేదు. దీంతో ఆంధ్రాలో ఉన్న మధ్యవర్తులను వారు ఆశ్రయించారు. ఈ క్రమంలో శ్రీదేవి అనే మహిళ విజయవాడకు చెందిన తాయారు అనే పెళ్లిళ్ల మధ్యవర్తిని వారికి పరిచయం చేసింది. తాయారు, పార్వతి, విమల, ఆటో డ్రైవర్ అప్పారావులు కృష్ణలంకకు చెందిన ఓ అమ్మాయిని, యువకుడి కుటుంబ సభ్యులకు చూపించారు.
Vijayawada Fake Marriage Case : గత నెల 13న విజయవాడలో పెళ్లిచూపులు తతంగం సైతం జరిపించారు. అమ్మాయి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ వివాహానికి ముందే రూ.3.5లక్షలు వరుడి కుటుంబం వద్ద మధ్యవర్తి వసూలు చేశాడు. మరోవైపు కర్ణాటకలో వివాహం జరిపిస్తామని యువకుడి కుటుంబ సభ్యులు అన్నారు. కానీ మధ్యవర్తులు కాదు కూడదంటూ ఈనెల 5న ఇంద్రకీలాద్రిపై పెండ్లి జరిపించారు. 7న కర్ణాటకలోని గంగావతిలో నవదంపతుల రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు.
పల్లవి వెంట వచ్చిన ఆమె సోదరుడు హరీష్ రిసెప్షన్ అయ్యాక తన తల్లికి బాగోలేదంటూ వరుడి కుటుంబం వద్ద రూ.50,000లు తీసుకొని అదృశ్యమయ్యాడు. భర్తతో కాపురం చేసేందుకు వధువు నిరాకరించడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. పల్లవిని నిలదీయగా తనకు గతంలోనే వివాహమైందని, భర్త, ఇద్దరు పిల్లలున్నారని చెప్పడంతో నవ వరుడి కుటుంబ సభ్యులు షాక్‌కి గురయ్యారు.
తనను భర్త వదిలేయడంతో పిల్లలతో కలిసి జీవిస్తున్నాన్నట్లు పల్లవి చెప్పింది. ఐదు రోజులు పెళ్లికూతురుగా నటిస్తే రూ.50,000లు ఇస్తామని తాయారు, పార్వతి, విమల, అప్పారావు ఆశ చూపినట్లు పేర్కొంది. వారి మాటలు నమ్మి ఈ వివాహం చేసుకున్నట్లు తెలిపింది. తనకు రావాల్సిన డబ్బుల్లో రూ.35,000లు మాత్రమే ఇచ్చారని, మిగిలిన డబ్బులను బ్రోకర్లు తీసుకున్నారని వివరించింది. మరోవైపు తన పేరు పల్లవి కాదని, అసలు పేరు ఆమని అని వెల్లడించింది. దీంతో మోసపోయినట్లు గ్రహించి బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
పెళ్లి కాని ప్రసాద్‌లు జాగ్రత్త - ఆదమరిస్తే అంతేసంగతులు
పెళ్లిళ్లలో తగ్గుతున్న బంధువుల సందడి - అంతా 'వారిదే' హడావుడి