Kamesha Maharshi Died In Amalapuram: ఆయన ఒక గొప్ప మానవతావాది. తల్లిదండ్రులను కోల్పోయిన ఎంతో మంది అనాధ పిల్లలను అక్కున చేర్చుకొని, మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన మహానుభావుడు. అలాంటి సేవా తత్పరుడు పరమపదించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో కామాక్షి పీఠాధిపతి 'కామేశ మహర్షి' కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం చనిపోయారు.
అనాధ పిల్లల ఉన్నతికి ఎంతో శ్రమించిన మహానుభావుడు కామేశ మహర్షి (86) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో అమలాపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో పరమపదించారు. ఈయన 1967లో 'కామాక్షి పీఠాన్ని' స్థాపించారు. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారు. 1985లో కామాక్షి ప్రేమ మందిరం ప్రారంభించి 1986 నుంచి అనాధ పిల్లలను అక్కున చేర్చుకోవడం మొదలుపెట్టారు. నేటి వరకు వందల సంఖ్యలో అనాధ పిల్లలను ఆయన చేరదీసి చదివించారు. వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్ది పలువురికి వివాహాలు కూడా జరిపించారు.
పుట్టెడు దుఃఖంలో ఆశ్రమ పిల్లలు: ఆయన ఆశ్రమంలో చేరిన వారిలో సుమారు 20 మంది యువకులు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగులుగా పని చేస్తున్నారు. అలాగే మిగిలిన వారు కూడా తమతమ జీవితాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆశ్రమంలో సుమారు 70 మంది అనాధ పిల్లలు ఉన్నారు. గురువుగారు శివైక్యం పొందడంతో అనాధ పిల్లలంతా పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ప్రముఖులు పట్టణ ప్రజలు అనేకమంది వచ్చి కామేశ మహర్షి పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.