Kakinada ASP IPS Manish Devaraj Patil: పోలీసు శాఖలో చేరాలనుకునే ఎందరికో సుందర స్వప్నం, కృషి, పట్టుదల, అంకితభావం, కఠోర శ్రమతో సుసాధ్యమయ్యే లక్ష్యం, బలమైన సంకల్పం ఉంటే ఐపీఎస్ సాధించగలమని నిరూపించారు కాకినాడ సబ్ డివిజనల్ పోలీసు అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి పోలీసు శాఖలో సర్వోన్నత సర్వీసుకు ఎంపికై ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఏఎస్పీ క్యాడర్‌లో సబ్ డివిజనల్ పోలీసు అధికారి (ఎస్‌డీపీవో)గా పని చేస్తున్న మనీష్ దేవరాజ్ పాటిల్ ఈ ఏడాది జనవరిలో ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు.
సాధారణ మధ్య తరగతి కుటుంబం: మనీష్ దేవరాజ్ పాటిల్ వయస్సు 26 ఏళ్లు. స్వస్థలం మహారాష్ట్రలోని ధూలే జిల్లా జల్‌గాన్. తండ్రి మనీష్ ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడు కాగా తల్లి జ్యోతి గృహిణి. ఓ సోదరి ఉన్నారు. ఈయనది సాధారణ మధ్య తరగతి కుటుంబం. పుణెలోని మోడరన్ ఇంజినీరింగ్ కళాశాలలో 2019లో బీటెక్ మెకానికల్ పూర్తి చేశారు. ఆ తరవాత ఈయనకి ఏం చేయాలో తెలియని సందిగ్ధత నెలకొంది.
గేట్, ఎంబీఏ (కాట్), యూపీఎస్‌సీ ఇలా ఆలోచిస్తూ చివరికి సివిల్స్‌కు సిద్ధమవడం ప్రారంభించారు. ఎక్కడా శిక్షణ తీసుకోకుండా వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, సామాజిక మాధ్యమాలు, యూట్యూట్, యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ అనుసరిస్తూ ఇంటిలోనే సొంతంగా చదువుకున్నారు. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు సాధన చేశారు.
ఆ ఒక్క ఘటన - బాలసుబ్రహ్మణ్యం జీవితాన్నే మార్చేసింది
2022 బ్యాచ్ ఐపీఎస్‌కు ఎంపిక: చరిత్రను ఐచ్ఛికంగా (ఆప్షనల్ సబ్జెక్ట్) ఎంచుకుని ఐఎఫ్‌ఎస్ (ఇండియన్ ఫారన్ సర్వీస్) లక్ష్యంగా చదివితే రెండో ప్రయత్నంలో 2022 బ్యాచ్ ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం తిరుపతిలో 6 నెలలు శిక్షణ ఐపీఎస్ అధికారిగా పని చేశారు. మొదటి పోస్టింగ్‌లో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా విశాఖపట్నంలో చేరారు. అనంతరం బదిలీపై కాకినాడ వచ్చారు. చదువుతో పాటు ఇతర అన్ని విషయాల్లో తల్లి ప్రోత్సాహం ఎక్కువని ఆయన తెలిపారు.
పుస్తకాలు, వార్తా పత్రికలకే రూ.10,000: జీవితం చాలా చిన్నదని సమయం వృథా చేయకుండా అనుకున్న లక్ష్యాన్ని త్వరగా చేరుకోవాలని మనీష్ చెప్తున్నారు. సబ్జెక్టు పుస్తకాలు, వార్తా పత్రికలకు మాత్రమే దాదాపు రూ.10,000 వరకూ ఖర్చుచేశారని ఇంటర్నెట్ అధికారిక వెబ్‌సైట్‌లు చూస్తూ సివిల్స్‌కి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకున్నట్లు వివరించారు. ఆన్‌లైన్ బ్లాగ్స్‌లో అందుబాటులో ఉండే అధ్యయన సామగ్రి వినియోగించుకున్ని చదివినట్లు వివరించారు.
అలా అనుకుంటేనే నేరాలు తగ్గుతాయి: సివిల్స్‌కు సన్నద్ధమయ్యేవారు శిక్షణ అంటూ దిల్లీ, ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని కృషి, సడలని పట్టుదల, సాధించాలనే సంకల్పం ఉంటే ఇంటి వద్దనే ఉంటూ చదువుకోవచ్చని మనీష్ సూచిస్తున్నారు. అలా ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని చెప్తున్నారు. స్నేహపూర్వక పోలీసింగ్‌ను తాను ఇష్టపడతానని అంటున్నారు. పోలీసులూ మన కుటుంబ సభ్యులే అన్నట్లుగా ప్రజలు భావించిన నాడు సమాజంలో నేరాలు తగ్గుతాయని మనీష్ పాటిల్ తెలిపారు.
కలలు కన్నాడు, కష్టపడ్డాడు - ఆకాశం అంచులు తాకే లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు