Journalist Krishnam Raju Files Anticipatory Bail Petition : అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితుడు కృష్ణంరాజు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. పోలీసులు తన కోసం వెతుకుతున్నారని అరెస్టు చేసి బాధించాలని చూస్తున్నారని హైకోర్టుకు తెలిపారు. విజయవాడ, అమరావతి చుట్టుపక్కల తనకు స్థిర, చరాస్తులు ఉన్నాయన్న కృష్ణంరాజు పోలీసు దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. హైకోర్టు ఈనెల 12న పిటిషన్‌పై విచారణ జరపనుంది.
పరారీలో వీవీఆర్ కృష్ణంరాజు : అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం పరారీలో ఉన్న వీవీఆర్ కృష్ణంరాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. విజయవాడ అయోధ్య నగర్‌లోని ఆయన ఇంటికి తాళం వేసి ఉందని, కుటుంబసభ్యులు కూడా లేరని సమాచారం. కృష్ణంరాజును పట్టుకోవడానికి తుళ్లూరు డీఎస్సీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో కృష్ణంరాజు కదలికలను పసిగట్టే పనిలో ఉన్నారు. విజయవాడ నుంచి ఎక్కడికి, ఎప్పుడు వెళ్లారనే విషయాలను నిఘా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రజల్ని రెచ్చగొట్టేలా సమావేశాలు : మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో అరెస్టయిన కొమ్మినేని శ్రీనివాసరావుకు, కృష్ణంరాజుకు పూర్వాశ్రమంలో మైత్రీబందం ఉన్నట్టు సమాచారం. కొమ్మినేని చొరవతోనే సాక్షి టీవీ డిబేట్‌లో రాజకీయ విశ్లేషకుడి ముసుగులో పాల్గొని 2014-19 మధ్య అమరావతితో పాటు, అప్పటి టీడీపీ ప్రభుత్వంపై కృష్ణంరాజు విషం కక్కారు. మళ్లీ ఇప్పటి కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడమే ఎజెండాగా పనిచేస్తున్నారు. 2014-18 మధ్య ఆయన పెట్టుకున్న 'ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ తరపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టేలా పలు సమావేశాలు నిర్వహించారు.
వాళ్లిద్దరిదీ అల్లుకున్న మైత్రీబంధం! : ఒక్క ఇంగ్లిషు మీడియం విషయంలో తప్ప జగన్ ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ ఆయన సమర్ధించుకుంటూ వచ్చారు. కృష్ణంరాజు ఏ కార్యక్రమం చేసినా సాక్షి పత్రిక ప్రముఖంగా ప్రచురిస్తుంది. ఆయన ఫేస్‌బుక్ ఖాతాలో ఆ పేపర్ క్లిప్పింగ్‌లన్నీ ఉంచుకున్నారు. తరచూ తనకు 'సాక్షి' డిబేట్‌లో మాట్లాడే అవకాశం కల్పించినందుకు తన జర్నలిస్ట్ పత్రిక పదో వార్షిక సంచిక ముఖచిత్రంగా కొమ్మినేని ఫొటో వేసి, 'జర్నలిస్ట్ ఆఫ్ ద ఇయర్" అంటూ కథనం ప్రచురించారు. అంతగా అల్లుకున్న మైత్రీబంధం వాళ్లిద్దరిదీ!
అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కిన మహిళలు
సోషల్ మీడియాలో సీఎం, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యలు - కేసులు నమోదు