Operation Garuda Joint Inspection On Drug Stores in AP : వైద్యుల సిఫార్సు లేకుండా మందులు విక్రయాలు చేస్తున్న ఔషధ దుకాణాలపై ఈగిల్ విభాగం, డ్రగ్ కంట్రోల్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఔషధ దుకాణాలపై ఆపరేషన్ గరుడలో భాగంగా 100 బృందాలతో ఆకస్మిక దాడులు చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో ఈగల్ టీమ్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసుల సంయుక్త తనిఖీలు చేపట్టారు.
మత్తును కలిగించే ఔషధాల విక్రయాలపై ఈగిల్ విభాగ పోలీసులు నిఘా పెట్టారు. వైద్యుల చీటీ లేకుండా సైకోట్రోఫిక్ డ్రగ్స్‌ను విక్రయిస్తున్న మందులషాపుల్లో అధికారులు సంయుక్తంగా దాడులు చేపట్టారు. రాష్ట్రంలో 645 హాట్ స్పాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆల్ఫ్రాజోలమ్, ట్రెమడాల్ లాంటి సైకోటిక్ మెడిసిన్‌ను అనధికారికంగా విక్రయిస్తున్నారని పోలీసుల సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నారు. విజయవాడలో భవానీపురం, గుణదల ప్రాంతాల్లోని ఔషధ దుకాణాల్లో సైకోట్రోపిక్ డ్రగ్స్ దుర్వినియోగం జరుగుతున్నట్లు గుర్తించామని ఈగిల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ తెలిపారు.
ఏపీలో విస్తృతంగా జనరిక్ మందుల దుకాణాలు- దీనికి వీరు మాత్రమే అర్హులు
మత్తు పదార్థాల అక్రమ అమ్మకాల నిరోధమే లక్ష్యంగా అధికారులు మెడికల్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. నెల్లూరు జిల్లాలోని పలు మెడికల్ దుకాణాల్లో విజిలెన్స్, డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆపరేషన్ గరుడలో భాగంగా ఆరు బృందాలుగా ఏర్పడిన అధికారులు నెల్లూరు నగరంలోని బోసుబొమ్మ, స్టోన్ హౌస్ పేట, మద్రాసు బస్టాండ్ ప్రాంతాలతో పాటు ఆత్మకూరులోనూ తనిఖీలు చేశారు. మెడికల్ షాపుల్లో నిషేధిత మత్తు పదార్థాలు ఎమైనా ఉన్నాయా? మత్తు పదార్థాల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలించారు. మత్తు పదార్ధాల అక్రమ అమ్మకాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ సీఐ నరసింహారావు, డ్రగ్స్ కంట్రోల్ ఏడి వీరకుమార్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీలు పూర్తి అయిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
వైద్యుల సిఫార్సు లేకుండా మందులు విక్రయాలు చేస్తున్న ఔషధ దుకాణాలపై విజిలెన్సు అధికారులు దాడులు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఔషధ దుకాణాలపై ఆపరేషన్ గరుడ లో భాగంగా నిర్వహిస్తున్న విజిలెన్సు దాడుల్లో అనంతపురంలో పలుచోట్ల మందుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. మత్తు కలిగించే ఔషధాలు విచ్చలవిడిగా విక్రయాలు చేస్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. పలు కంపెనీలకు చెందిన నిద్రమాత్రలు, మత్తు కలిగించే సిరప్లు వైద్యుల సిఫార్సు లేకుండా కౌంటర్ డ్రగ్‌గా విక్రయిస్తున్నారు. దీనిపై లోతుగా పరిశీలన చేస్తున్న విజిలెన్సు, ఔషధ నియంత్రణ విభాగం అధికారులు, ఈసారి పోలీసుల సహకారం కూడా తీసుకున్నారు.
ఔషధ దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు
ఎక్కడైనా ఔషధ దుకాణాల్లో అక్రమాలు జరిగినట్లు నిర్దారణ జరిగినా, నిబంధనలకు వ్యతిరేకంగా ఔషధాలు విక్రయాలు చేసినట్లు ఆధారాలు లభించినా క్రిమినల్ కేసులు నమోదు చేసేలా పోలీసుల సహకారం తీసుకున్నారు. అనంతపురం నగరంలో అధికంగా ఫిర్యాదులు వస్తున్న దుకాణాలను ఎంపికచేసుకొని విజిలెన్సు అధికారులు దాడులు నిర్వహించారు. వైద్యుల సిఫార్సు లేకుండా మందులు విక్రయిస్తున్న వైనంపై పరిశీలన చేస్తున్నట్లు విజిలెన్సు విభాగం జిల్లా అదనపు ఎస్పీ అంకె ప్రసాద్ చెప్పారు.
ఆపరేషన్ గరుడలో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలలో విజిలెన్స్, డ్రగ్ కంట్రోల్ అధికారులు పలు ఔషధ దుకాణాలపై దాడులు నిర్వహించారు. అందులో భాగంగా జనత మందుల దుకాణంలో కూడా దాడులు చేపట్టారు. అమ్మిన మందులకు దుకాణంలో ఉన్న మందులకు పొంతనలేదని అధికారులు గుర్తించారు. కొన్ని మందుల వివరాలను రికార్డ్స్‌లో పొందుపరచలేదని అధికారులు గుర్తించారు.
ఈ మేరకు దస్త్రాలు సరిగా లేని దుకాణాలపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. డాక్టర్ల మందుల చీటీ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మందులు విక్రయించరాదని దుకాణదారులను హెచ్చరించారు. కొన్ని మందులు మానసిక రోగులకు ఉపయోగిస్తారని వాటిని కొంతమంది యువత మత్తుమందుగా ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. ఉమ్మడి కడప జిల్లాలలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
మీ చర్యలతో MBBS సీటు కోల్పోయింది - రూ.7 లక్షలు చెల్లించండి: హైకోర్టు