Jiyanapeta Villagers Reaction on Maoist Nambala Death: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యనపేటలో స్తబ్దత నెలకొంది. 4 దశాబ్దాల క్రితం నుంచి కేశవరావు గ్రామానికి దూరమైనట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అయితే నంబాల కేశవరావు ఉద్యమంలో చేరాక స్వగ్రామానికి ఎప్పుడూరాలేదని గ్రామస్థులు చెబుతున్నారు. కేశవరావుకు ఒక ఇద్దరు సోదరులతో పాటు ముగ్గురు సోదరీమణులు ఉన్నారని వీరంతా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారని చెప్తున్నారు. వారి కుటుంబసభ్యులు సైతం గ్రామానికి వచ్చిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు.
4 దశాబ్దాల క్రితం గ్రామానికి దూరం: కోటబొమ్మాళి మండల కేంద్రానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలోని జియ్యన్నపేట అనే చిన్న గ్రామంలో నంబాల 1955లో జన్మించారు. కేశవరావు తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయునిగా పని చేశారు. కాగా తల్లి లక్ష్మీనారాయణమ్మ. వీరికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. రెండో సంతానం కేశవరావు. కేశవరావు ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. తాతగారి ఊరు అయిన టెక్కలి మండలం తలగాంలో ఉన్నత పాఠశాల విద్య, టెక్కలి జూనియర్ కళాశాలో ఇంటర్ చదివారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగా వరంగల్‌లో బీటెక్ రావడంలో అక్కడికి వెళ్లి చేరారు.
అలా అజ్ఞాతంలోకి: ఆర్‌ఈసీలో చదివే సమయంలో కేశవరావు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ) కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. అప్పట్లో ఆర్‌ఎస్‌యూ, ఏబీవీపీల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగేవి. వీటిల్లో బీటెక్ విద్యార్థి జాన్ హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో కేశవరావుపై హత్య కేసు నమోదవడంతో పోలీసులు అరెస్టు చేసి, జైలుకు తరలించారు. అతనిపై నమోదైన తొలి కేసు ఇదే. 1980లో బెయిల్‌పై విడుదలైన కేశవరావు ఆ వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లారు.
విశాఖ మన్యం ప్రాంతంలో సీహెచ్ రాజ్‌కుమార్ అనే పీడబ్ల్యూజీ కార్యకర్తతో కలిసి పనిచేశారు. 1983-85 మధ్య విశాఖ జిల్లా కమిటీ సభ్యుడిగా ఎంపికైన కేశవరావు ఏడాది తిరగకముందే జిల్లా కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. అప్పటి తూర్పు డివిజన్ అటవీ కమిటీ సభ్యుడిగానూ పని చేశారు. మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన ఎల్‌వోఎస్ కమాండర్ శారదను 1990లో వివాహం చేసుకున్నారు. తర్వాత 2010లో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
మంచి కబడ్డీ ఆటగాడు: కేశవరావు అన్న ఢిల్లీశ్వరరావు పోర్టుబ్లెయిర్ పోర్టు చైర్మన్‌గా పని చేశారు. ఢిల్లీశ్వరరావు, కేశవరావు ఇద్దరూ మంచి కబడ్డీ క్రీడాకారులు. శ్రీకాకుళం సాయుధ భూపోరాట ప్రభావం తొలి నుంచి కేశవరావుపై ఉంది. కళాశాలలో చదువుతున్నప్పుడే విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించారు. రాడికల్ ఉద్యమంలోని సూరపనేని జనార్దన్, జన్ను చిన్నా ప్రభావంతో కేశవరావు అటువైపు అడుగులు వేశారు. అయితే 1970 చివరలో కేశవరావు తన స్వగ్రామాన్ని వదిలి పెట్టారు. తన పేరు మీద స్వగ్రామంలో ఎలాంటి ఆస్తి లేదు.
తమ్ముడి పెళ్లికి అలా: స్వగ్రామంలో కేశవరావు ఇంటికి తాళం వేశారు. కుటుంబ సభ్యులంతా విశాఖ, ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరావు చాలాకాలంపాటు సొంతూరు వెళ్లలేదు. 1993 జూన్‌లో ఆయన సోదరుడి వివాహం జరిగింది. దీనికి కేశవరావు హాజరయ్యే అవకాశముందని భావించిన పోలీసులు గ్రామం చుట్టూ పెద్ద ఎత్తున మోహరించారు. వారి కళ్లుగప్పి పశువుల కాపరి రూపంలో ఆయన ఈ వివాహానికి వచ్చారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ తర్వాత ఇప్పటివరకు జియ్యన్నపేటకు రాలేదు. కుమారుడు ఇంటికి రావడంలేదనే బెంగతో కేశవరావు తండ్రి 1997 జనవరి 23న మృతి చెందారు.
మిలిటరీ కమిషన్ చీఫ్‌గా: దక్షిణ భారతంలో పట్టున్న పీపుల్స్‌వార్ గ్రూపు, ఉత్తరాదిలో కీలకంగా వ్యవహరించిన మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీసీఐ), మరికొన్ని విప్లవ గ్రూపులు విలీనమై 2004లో సీపీఐ (మావోయిస్టు)గా అవతరించింది. అంతకుముందు 1993లో పీపుల్స్‌వార్ కార్యదర్శిగా కొండపల్లి సీతారామయ్యను తొలగించాక ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి 2004 వరకూ కార్యదర్శిగా కొనసాగారు. మావోయిస్టు పార్టీ ఏర్పడ్డాక 2004 నుంచి 2018 వరకు తొలి ప్రధాన కార్యదర్శిగా గణపతే వ్యవహరించారు. ఆ సమయంలో సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ బాధ్యతలను కేశవరావు నిర్వర్తించారు.
రెండో ప్రధాన కార్యదర్శి: గెరిల్లా యుద్ధ వ్యూహాలను రచించి, అమలు చేయడంతోపాటు ఆయుధాల కొనుగోలు, సరఫరాలాంటి వ్యవహారాలను పర్యవేక్షించేవారు. బాంబుల వినియోగంలో దిట్టగా ఆయనకు పేరుంది. ముఖ్యంగా మావోయిస్టులు ఎక్కువగా వాడే ఐఈడీల వినియోగంలో నేర్పరిగా గుర్తింపు పొందారు. గణపతి వయోభారంతో రాజీనామా చేశాక 2018లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేశవరావు బాధ్యతలు చేపట్టారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావం తర్వాత దానికి రెండో ప్రధాన కార్యదర్శి ఆయనే. అంతకు ముందు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పని చేశారు.
16కు పైగా కేసులు: తెలుగు రాష్ట్రాల్లోని సీలేరు, చింతపల్లి, కేడీపేట, పర్వతగిరి, జీకే వీధి, మందస, కొయ్యూరు, బత్తిలి, తిరుమల తదితర ఠాణాల్లో ఆయనపై 16కు పైగా కేసులున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే ఈ కేసుల సంఖ్య లెక్కకు మించి. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు సైతం మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న కేశవరావుపై... ఎన్‌ఐఏతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు రివార్డులను ప్రకటించాయి. మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్(సీఎంసీ) కార్యదర్శి హోదాలో పలు కీలక మిలిటరీ ఆపరేషన్లు నిర్వహించిన నేపథ్యంలో ఆయనపై రివార్డులు పెరుగుతూ పోయాయి. అలా బుధవారం మరణించే నాటికి ఆయనపై రూ.2.02 కోట్ల రివార్డు ఉండటం గమనార్హం.
పేర్లు ఎన్నో: సొంత పేరు నంబాల కేశవరావు అయినప్పటికీ ఆయన బస్వరాజ్, గంగన్న, ప్రకాశ్, కృష్ణ, విజయ్, ఉమేశ్, కేశవ్, ఉమేశ్, బీఆర్, దారపు నరసింహారెడ్డి, నర్సింహ అనే పేర్లతో కొనసాగారు.
చంద్రబాబుపై బాంబు దాడి మొదలు బలిమెల ఘటన వరకు:
- తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 2003 అక్టోబరు 1న వెళ్తున్న నాటి సీఎం చంద్రబాబుపై అలిపిరి వద్ద క్లెమోర్‌మైన్స్‌తో దాడికి పాల్పడిన ఘటనకు సూత్రధారి కేశవరావే.
- కూంబింగ్ ఆపరేషన్స్ చేపట్టి బలిమెల రిజర్వాయర్ మీదుగా లాంచీలో తిరుగు ప్రయాణమై వస్తున్న గ్రేహౌండ్స్ కమాండోలపై 2008 జూన్ 28న మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో 36 మంది కమాండోలు మృతి చెందారు. ఈ దాడి వ్యూహరచన, అమలు బాధ్యతలన్నీ కేశవరావే చూశారు.
- మావోయిస్టుల చరిత్రలో అతిపెద్ద ఘటనగా చింతల్నార్ దాడి ఘటనను చెబుతారు. బస్వరాజ్ మార్గదర్శకత్వంలో 2010 ఏప్రిల్‌లో దంతేవాడ జిల్లా చింతల్నార్‌లో జరిగిన దాడిలో ఏకంగా 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు.
- 2018 సెప్టెంబరులో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చిన ఘటన వెనక ఉన్నది కేశవరావే.
- మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వాజుడుంను సృష్టించిన కాంగ్రెస్ నేత మహేంద్రకర్మను ఛత్తీస్‌గఢ్‌లోని జీరంగట్టిలో దాడి చేసి అంతమొందించారు. అప్పుడు 27 మందిని మందుపాతరతో పేల్చడంతోపాటు కాల్చి చంపారు. దీనికీ కేశవరావే వ్యూహకర్తగా చెబుతారు.
ప్రజాసేవ చేస్తానని : ‘‘కేశవరావు కబడ్డీ ఎక్కువగా ఆడేవారు. వ్యవసాయంపై అభిమానం చూపేవారు. పాఠశాల నుంచి వచ్చాక వ్యవసాయ బావుల నుంచి నీరు తోడేవాళ్లం. జియ్యన్నపేట నుంచి కోటబొమ్మాళి సినిమా హాలుకు నడుచుకుని వెళ్లేవాళ్లం. తండ్రి ఉద్యోగం చేయాలని సూచించినా ‘ప్రజాసేవ చేస్తానని, నా బతుకు నేను బతుకుతానని’ చెప్పి వెళ్లిపోయాడు’’ అంటూ అటవీ శాఖ విశ్రాంత ఉద్యోగి, కేశవరావు స్నేహితుడు కూన రమణయ్య తెలిపారు.
ఎంటెక్ చదువుతూ ఉద్యమానికి ఆకర్షితుడై దళంలోకి - ఇదే నంబాల జీవిత చరిత్ర!
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్- మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి- మొత్తం 27మంది హతం!