Handicapped Person Pathetic Situation : పుట్టకతోనే కాళ్లు వంకరపోవడంతో అతికష్టం మీద నడుచుకుంటూ బడికెళ్లి పదో తరగతి పూర్తి చేశాడు జనగామ జిల్లా దేవరుప్పల గ్రామానికి చెందిన కొమరమల్లు. గొర్రెల కాపరులైన తల్లిదండ్రులు కొమరమ్మ, యాకయ్యలు ప్రతి రోజు బిడ్డ పడే కష్టాన్ని చూసి భరించలేక పలువురు వైద్యులను సంప్రదించి 2004 సంవత్సరంలో శస్త్ర చికిత్స చేయించారు. ఏమైందో ఏమో అప్పట్నుంచి రెండు కాళ్లు పూర్తిగా చచ్చుపడిపోయాయి. బిడ్డను మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు కొమరమల్లు తల్లిదండ్రులు తీవ్రంగా శ్రమించారు. చికిత్స కోసం రూ.5 లక్షల వరకూ ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. అయినా ధైర్యం కోల్పోని కొమరమల్లు పాకుతూనే తన జీవనయానం కొనసాగిస్తున్నాడు. హైదరాబాద్లో డిగ్రీ పూర్తి చేశాడు. ఇటీవలే గ్రూప్-1 పరీక్షలు రాశాడు. అంత బాధనీ పంటి బిగువున భరిస్తున్న కొమరమల్లు తల్లిదండ్రుల రూపంలో వచ్చిపడిన కష్టం మరింత కుంగదీస్తోంది.
ఉపాధి చూపితే తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటాను : పోటీ పరీక్షల శిక్షణ కోసం రెండు సంవత్సరాల క్రితం తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌కు వచ్చానని కొమరమల్లు తెలిపారు. తుర్కయాంజల్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నానని, తనకు ఉపాధి లేదని అన్నారు. నాన్నకు, తనకు వచ్చే ఆసరా పింఛనుతో అద్దె చెల్లిస్తూ మిగిలిన సొమ్ముతో బతుకీడుస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 8 పదుల వయసు ఉన్న కన్నవారు వృద్ధాప్యం కారణంగా కూర్చుంటే లేవలేని, లేస్తే కూర్చోలేని పరిస్థితికి వచ్చారని వాపోయారు. కన్నవారి కోసం ఎంతైనా కష్టపడగలనని, కానీ తల్లిదండ్రుల కడుపు నింపలేకపోతున్నాననే బాధ తనని మరింత కుంగదీస్తోందని కొమరమల్లు కన్నీటి పర్యంతమవుతున్నాడు. దయగలవారు ఎవరైనా తనకు ఉపాధి చూపితే తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటానని అంటున్నాడు.