Jalaharati Corporation For Polavaram Banakacharla Project: పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు జలహారతి కార్పొరేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కంపెనీల చట్టం కింద వంద శాతం ప్రత్యేక వాహక సంస్థగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఛైర్మన్‌గా జల హారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. వైస్ ఛైర్మన్‌గా మంత్రి నిమ్మల రామానాయుడు, సంస్థ సీఈఓగా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ఉండనున్నారు.
పోలవరం ప్రాజెక్టు నుంచి వరద జలాలను తరలించేలా పోలవరం-బనక చర్ల లింకు ప్రాజెక్టును రూపొందించనున్నారు. 80 లక్షల మందికి తాగునీటిని అందించేలా పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. కొత్తగా 3 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాగులోకి వస్తుందని ప్రభుత్వ అంచనా వేస్తోంది. దాదాపు 9.14 లక్షల హెక్టార్లకు నీటిని ఇవ్వటంతో సహా 20 టీఎంసీల వరకు పరిశ్రమలకు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుకు రూ.80,112 కోట్ల వరకు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది.
రాయలసీమకు నీరందించేలా చర్యలు: గోదావరి బేసిన్లో వృథాగా పోతున్న వరద జలాలను లోటు ఉన్న ప్రాంతాలకు తరలించేలా లింకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి బనకచర్ల రెగ్యులేటర్ వరకూ నీటిని తరలించేలా ప్రణాళిక రూపొందించనున్నారు. దాదాపు 150 టీఎంసీల వరకూ నీటిని తరలించేందుకు ఆస్కారం ఉందని లోటు ఉన్న జిల్లాలకు ఈ వరద జలాలను వినియోగించుకోవచ్చని యోచిస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండే రాయలసీమ జిల్లాలకు నీటిని అందించేలా ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రత్యేక వాహక సంస్థగా జలహారతి: పోలవరం - బనకచర్ల రెగ్యులేటర్ కు కాలువలు, ఎత్తిపోతల పథకాలు, భూగర్భ పైప్ లైన్లు, సొరంగాల ద్వారా నల్లమల నుంచి నీటిని తరలించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికోసం ఓ ప్రత్యేక వాహక సంస్థగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఎస్పీవీగా బహిరంగ మార్కెట్ల నుంచి నిధులు సేకరించేందుకు అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనకు తుదిరూపు
పోలవరం డయాఫ్రం వాల్ కాంక్రీట్ నిర్మాణ పనులకు ముహూర్తం ఫిక్స్