ETV Bharat / state

తిరుమలలో ఏఐ సేవలు - దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు

టీటీడీ కీలక నిర్ణయం - ఐసీసీసీ ద్వారా సైబర్ దాడులు, తప్పుడు సమాచారానికి చెక్, భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందించేందుకు చర్యలు

India First AI Integrated Command Control
India First AI Integrated Command Control (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 24, 2025 at 7:57 AM IST

3 Min Read
Choose ETV Bharat

India First AI Integrated Command Control in Tirumala: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి నిత్యం వచ్చే వేల మంది భక్తుల ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు టీటీడీ కృతిమ మేధస్సును (ఏఐ) వినియోగించనుంది. తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటరును ఎన్ఆర్​ఐల దాతృత్వంతో తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 లో టీటీడీ ఏర్పాటు చేయనుంది. సెప్టెంబర్​ 25న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించబోతున్న సందర్భంగా‌ కమాండ్ కంట్రోల్ రూమ్​ను ఛైర్మన్​ బిఆర్ నాయుడు అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు.

శ్రీవారి దర్శనానికి నిత్యం వచ్చే వేల మంది భక్తుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు కృతిమ మేధస్సు (ఏఐ) ను వినియోగించాలని ఛైర్మన్ నిర్ణయం ప్రకారం ఎన్ఆర్ఐల దాతృత్వంతో దేశంలో తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)ను టీటీడీ అందుబాటులోకి తీసుకొస్తుంది.

ఐసీసీసీ ఇలా పనిచేస్తుంది: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 లోని 25 వ నంబర్ కంపార్టుమెంటులో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందించేందుకు చర్యలు చేపట్టనుంది. ఈ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఐసీసీసీలో పెద్ద డిజిటల్ స్క్రీన్​పై అన్ని విభాగాలకు చెందిన సీసీ టీవీ పుటేజీలు కనిపిస్తాయి. వీటిని 25 మందికి పైగా సాంకేతిక సిబ్బంది పర్యవేక్షిస్తూ అధికారులకు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తారు. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు కొత్తగా అమర్చిన ప్రత్యేక కెమెరాలతో అలిపిరి వద్ద నుంచే భక్తుల రద్దీని ఏఐ అంచనా వేస్తుంది. క్యూలైన్లలో ఎంతమంది భక్తులున్నారు? ఎంత సమయంగా వారు నిరీక్షిస్తున్నారు? సర్వదర్శనం పరిస్థితి మొదలైన తదితర అంశాలను ఏఐ ట్రాక్ చేస్తుంది.

అంతేకాకుండా ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా భక్తులను గుర్తిస్తుంది. చోరీలు, ఇతర అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా కనిపెడుతుంది. తప్పిపోయిన వారు ఎక్కడున్నారో తెలియజేస్తుంది. భక్తుల ముఖ కదలికలు (హావభావాలు) ఆధారంగా వారి ఇబ్బందులు తెలుసుకుంటుంది. క్యూలైన్లు, వసతి ఇతర సౌకర్యాలను వాస్తవ పరిస్థితులతో 3డీ మ్యాప్​లు, చిత్రాలతో చూపుతుంది. రద్దీ ఉన్న ప్రాంతాలను రెడ్ స్పాట్లుగా చూపడంతో పాటు చర్యలకు సంకేతాలను ఇస్తుంది.

India First AI Integrated Command Control
ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (Eenadu)

ఆన్​లైన్​లో నిరంతరం పర్యవేక్షిస్తూ సైబర్ దాడులు, టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతినే సామాజిక మాధ్యమాల్లో పెట్టే అనుచిత పోస్టులు, ఆన్ లైన్​లో తప్పుడు సమాచారాలను అడ్డుకుంటుంది. ఎప్పటికప్పుడు భక్తుల అనుభవాలు తెలుసుకుని శ్రీవారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో భక్తులను బయటకు తీసుకొచ్చే సమీప మార్గాలను సైతం చూపుతుంది.

అత్యాధునిక పద్ధతులతో ఐసీసీసీ: గతేడాది అక్టోబరు నెలలో మంత్రి లోకేశ్‌ ఆమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు కొంతమంది ఎన్‌ఆర్‌ఐలు ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సిస్టం గురించి వివరించారని టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి అన్నారు. అక్కడి ప్రతినిధులు ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరుమలలో దీనిపై ప్రెజంటేషన్‌ ఇచ్చారు. పూర్తిగా డోనేషన్‌ బేసిస్‌లో చేస్తామని స్వచ్ఛందంగా వారు ముందుకొచ్చారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

ఉన్నతాధికారుల సహకారంతో ఒప్పందం చేసుకున్నామని, వైకుంఠం-1 కాంప్లెక్స్‌లో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ సిస్టం స్థానంలో సుమారు రూ.30 కోట్ల వ్యయంతో అత్యాధునిక పద్ధతుల్లో ఐసీసీసీని ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టీటీడీ దీన్ని తొలిసారి అందుబాటులోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు.

మొదటిసారి 'తిరుమల బ్రహ్మోత్సవాలు' ఎవరు నిర్వహించారు - ఆ పేరు ఎలా వచ్చిందంటే!

24 నుంచి బ్రహ్మోత్సవాలు - ఇలా చేస్తే సులభంగా శ్రీవారి దర్శనం