భక్తుల సమస్యలకు చెక్ - తిరుమలలో దేశంలోనే తొలి ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్
దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ - ఎన్‌ఆర్‌ఐల దాతృత్వంతో తిరుమల వైకుంఠం-1లో ఏర్పాటు - 25న సీఎం చేతుల మీదుగా ప్రారంభం

By ETV Bharat Andhra Pradesh Team
Published : September 23, 2025 at 7:09 AM IST
India's First AI Integrated Command Control Center in Tirumala: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే వేల మంది భక్తుల ఇబ్బందులను తీర్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కృతిమ మేధస్సును (ఏఐ) ఉపయోగించనుంది. ఎన్‌ఆర్‌ఐల దాతృత్వంతో దేశంలోనే తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)ను అందుబాటులోకి తెచ్చింది. వైకుంఠం-1 కాంప్లెక్స్‌లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందించేందుకు చర్యలు చేపట్టనుంది. ఈ ఏఐ కేంద్రాన్ని ఈ నెల 25న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
ఐసీసీసీ ఎలా పనిచేస్తుందంటే:
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పెద్ద డిజిటల్ స్క్రీన్‌పై అన్ని విభాగాలకు చెందిన సీసీ టీవీ ఫుటేజీలు కనిపిస్తాయి. వీటిని 25 మందికిపైగా సాంకేతిక సిబ్బంది పర్యవేక్షిస్తూ అధికారులకు అక్కడ ఉండే పరిస్థితులను తెలియజేస్తారు.
- ప్రస్తుతం ఉన్న వాటితో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కెమెరాలతో అలిపిరి వద్ద నుంచే భక్తుల రద్దీని ఏఐ అంచనా వేస్తుంది. క్యూలైన్లలో ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంత సమయంగా వారు వేచి ఉన్నారు, సర్వదర్శనం పరిస్థితి తదితర అంశాలను ఏఐ ట్రాక్ చేస్తుంది.
- ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా భక్తులను గుర్తిస్తుంది. చోరీలు, ఇతర అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా వెంటనే కనిపెడుతుంది. అలానే తప్పిపోయిన వారు ఎక్కడున్నారో తెలియజేస్తుంది. భక్తుల ముఖ కదలికలు (హావభావాలు) ఆధారంగా వారి ఇబ్బందులు తెలుసుకుంటుంది.
- క్యూలైన్లు, వసతి ఇతర సౌకర్యాలను వాస్తవ పరిస్థితులతో 3డీ మ్యాప్‌లు, చిత్రాలతో చూపుతుంది. రద్దీ ఉన్న ప్రాంతాల్ని రెడ్ స్పాట్లుగా చూపడంతో పాటు చర్యలు తీసుకోవాలని సంకేతాలు ఇస్తుంది.
- ఆన్‌లైన్‌లో నిరంతరం పర్యవేక్షిస్తూ సైబర్ దాడులు, టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతిసే విధంగా సోషల్ మీడియాలో పెట్టే అనుచిత పోస్టులు, ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారాలను అడ్డుకుంటుంది.
- ఎప్పటికప్పుడు భక్తుల పరిస్థితిని తెలుసుకుని శ్రీవారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో భక్తులను బయటకు తీసుకొచ్చే సమీప మార్గాలను చూపుతుంది.

అత్యాధునిక పద్ధతుల్లో ఐసీసీసీ: గత అక్టోబరులో మంత్రి లోకేశ్ ఆమెరికా పర్యటనకెళ్లినప్పుడు కొంతమంది ఎన్‌ఆర్‌ఐలు ఇంటిగ్రేటెడ్ కమాండ్ సిస్టం గురించి వివరించారని టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు. అక్కడి ప్రతినిధులు ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరుమలలో దీనిపై ప్రెజంటేషన్ ఇచ్చారని ఇంక పూర్తిగా డోనేషన్ బేసిస్‌లో చేస్తామని స్వచ్ఛందంగా ముందుకొచ్చారని అన్నారు. ఉన్నతాధికారుల సహకారంతో ఒప్పందం చేసుకుని వైకుంఠం-1 కాంప్లెక్స్‌లో ఉన్న కమాండ్ కంట్రోల్ సిస్టం స్థానంలో సుమారు రూ.30 కోట్లతో అత్యాధునిక పద్ధతుల్లో ఐసీసీసీని ఏర్పాటు చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టీటీడీలో దీన్ని తొలిసారి అందుబాటులోకి తెచ్చామని వెంకయ్యచౌదరి అన్నారు.
శ్రీవారికి 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలు విరాళం - బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వేళలు
కొత్తగా 1500 బస్సుల కొనుగోలుకు నిర్ణయం - సౌకర్యాలపై ఆర్టీసీ ఎండీ ఆరా

