Insomnia Problem in East Godavari : పిల్లల నుంచి పెద్దల వరకు నేడు ఎక్కువ మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిశోధనల ప్రకారం 8 గంటల కంటే తక్కువగా నిద్రపోతున్నవారిలో శారీరక సామర్థ్యం తగ్గుతున్నట్లు గుర్తించారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర సమస్యలతో ఒత్తిడికి గురవుతుండటం వలన నిద్రకు దూరమవుతూ అనారోగ్యం పాలవుతున్నారు. మొబైల్ స్క్రీనింగ్ వినియోగం సైతం పెరిగిపోయింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ సమస్య పెరుగుతోంది.
ఇదీ పరిస్థితి: కాకినాడకు చెందిన 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి రెండో ఏడాది పరీక్షల్లో ఫెయిలయ్యాడు. రాత్రంతా ఫోన్లో అధికంగా గడపటం, కాలేజీకి సరిగా వెళ్లకపోవడం, చదువులో వెనుకబడటంతో మానసిక చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.
- అమలాపురానికి చెందిన ఉద్యోగి సామాజిక మాధ్యమాల వీక్షణలో ఎక్కువగా గడుపుతుంటారు. నిద్రలేక తలనొప్పితో బాధపడుతూ, పనిపై శ్రద్ధ పెట్టలేకపోతున్నానని మానసిక వైద్యుడిని సంప్రదించారు.
- రాజమహేంద్రవరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని వర్క్‌ఫ్రం హోం చేసుకుంటూ ఇంటి వద్దే ఉంటున్నారు. రాత్రి సమయంలో డ్యూటీ చేస్తున్నప్పుడు ల్యాప్‌టాప్ స్క్రీనింగ్ సమయం ఎక్కువ కావడం, ఉద్యోగంలో ఒత్తిడితో నిద్ర సమస్య ఎదుర్కొంటున్నారు.
- యానాంకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి నిద్రపట్టక వైద్యుల సలహా లేకుండా మందులు వాడుతున్నాడు. అవి వేసుకోకుండా ఉండలేని పరిస్థితికి వచ్చారు. అనంతరం హాస్పిటల్లో చికిత్స పొందితే తప్ప బయటపడలేకపోయారు.
వందల మంది విద్యార్థుల్లో : కాకినాడ జిల్లా కేంద్రంలో ఉన్నత విద్యను అభ్యసించే 250 మంది విద్యార్థుల నిద్ర అలవాట్లను మానసిక వైద్య నిపుణుల బృందం రెండు నెలలపాటు పరిశీలించింది. 90% మంది కనురెప్పలు వాల్చేది అర్ధరాత్రి ఒంటి గంట తర్వాతేనని తేలింది. మొబైల్‌కు రాత్రివేళల్లో అతుక్కుపోవడం గమనించారు. ఒక్క కాకినాడ జీజీహెచ్‌కే నిద్రలేమి సమస్యతో ఇతర ప్రాంతాల నుంచి రోజూ 100 మంది వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
మంచి నిద్రకు చిట్కాలు
- గాఢనిద్రతోనే ఒత్తిడి తగ్గి, నూతనోత్తేజంతో ఉత్సాహంగా పనిచేయవచ్చని నిపుణులు చెప్పేమాట.
- రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు కావాలి. ఏదైనా కారణంతో ఆలస్యంగా నిదురించినా మరుసటి ఒకే సమయానికి నిద్రలేవాలి. దీనివల్ల మెదడులో ఉత్పత్తయ్యే మెలటోనిన్ సమతుల్య స్థాయిలో ఉంటుంది.
- క్రమం తప్పకుండా వ్యాయామం, వేళకు ఆహారం, యోగా, ధ్యానం మంచిది. గదిలో గాలి, వెలుతురు సమంగా ఉండాలి.
- పడక గదిలో టీవీ, మొబైల్, ల్యాప్‌టాప్ వినియోగం కూడదు.
- రాత్రి వేళల్లో అధిక ఆహారం తినడం, మద్యం సేవించడం చేయకూడదు. సాయంత్రం 5 దాటిన తరువాత టీ, కాఫీలు తాగకపోవడమే మంచిది.
- మధ్యాహ్నం భోజనం తరువాత గంటలకొద్దీ నిద్రపోతే రాత్రి వేళల్లో కునుకురాకుండా చేస్తుంది.
బుక్ పట్టగానే నిద్ర ముంచుకొస్తుందా? - ఈ టిప్స్ పాటిస్తే యాక్టివ్‌గా ఉంటారు!
అసలు సమస్య గుర్తించడం తప్పనిసరి : కాకినాడ జీజీహెచ్ మానసిక విభాగానికి వచ్చేవారిలో అధిక శాతం నిద్రలేమితో బాధపడుతున్నారని డాక్టర్ వానపల్లి వరప్రసాద్ తెలిపారు. కేవలం నిద్ర సమస్యగా చూడకుండా దాని వెనుకున్న అసలు మానసిక ఇబ్బందులను గుర్తించి వైద్యం తీసుకుంటేనే మంచిదని వివరించారు. ఉమ్మడి జిల్లాలో డాక్టర్ సలహా లేకుండా మాత్రలు కొని వాటికి బానిసలుగా మారడం కలవరపరిచే అంశమని ఆందోళన చెందారు.
విద్యార్థులూ నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా? నిపుణులు ఏమంటున్నారంటే!