Heavy Rain Alert in AP : ఈ నెల 23 లేదా 24 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించడానికి పరిస్థితులు అత్యంత అనుకూలంగా మారుతున్నాయని ఐఎండీ మంగళవారం నాడు వెల్లడించింది. ఈ నెల 26 నాటికి రాయలసీమ మీదుగా ఏపీలోకి ప్రవేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది రుతుపవనాలు సాధారణం (జూన్ 1) కంటే రెండు రోజులు ముందుగా మే 30న కేరళను తాకాయి. అదేరోజు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతం మీదుగా ఈశాన్య రాష్ట్రాలకూ విస్తరించాయి.
కేరళ తీరం, ఈశాన్య ప్రాంతాలను ఒకేసారి నైరుతి తాకడం చాలా అరుదైన విషయం. 2017లోనూ ఇలాంటి సందర్భమే చోటుచేసుకుంది. ఈ సంవత్సరం అలాగే జరుగుతుందని నిపుణుల అంచనా. ఐఎండీ డేటా ప్రకారం 2009లో మే 23న రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ సారి అంచనాలకు అనుగుణంగా 24న కేరళలోకి నైరుతి ప్రవేశిస్తే 2009 తర్వాత అత్యంత వేగంగా రావడం ఇదే మొదటిసారి కానుంది.
Southwest Monsoon 2025 : ఇప్పటికే మన దేశంలో సాగుభూమిలో 52 శాతం వర్షపాతమే ప్రధాన ఆధారం. మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40 శాతం దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు కీలక పాత్ర వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి ముఖ్యమైన జలాశయాలను తిరిగి నింపడానికి ఇవి ఆధారంగా ఉన్నాయి. అంతేకాకుండా దేశ జీడీపీకి 18.2 శాతం తోడ్పాటుకు ఇది ఎంతో ముఖ్యం.
రాష్ట్రానికి అతి భారీ వర్ష సూచన : అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడును ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. వీటి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు(గురువారం) విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ఇవాళ తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో అతి భారీ వర్షాలకు అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.