EARLY ARRIVE OF MONSOON THIS YEAR : వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు ఈసారి వేగంగా ముందుకు కదులుతున్నాయి. రాబోయే 4-5 రోజుల్లో అండమాన్, నికోబార్ దీవులు, దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది. అండమాన్ సమీపంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో బుధవారం (14వ తేదీన) ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముంది.
పరిస్థితులు అనుకూలిస్తే ఇది అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. దీనిపై ఐఎండీ (India Meteorological Department) నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తా, రాయలసీమ, గురువారం రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
కాకానిలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత : మరోవైపు ఏపీ వ్యాప్తంగా ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో 43.7 డిగ్రీలు, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 43.5, ప్రకాశం జిల్లా జువ్విగుంటలో 43.3, ఎన్టీఆర్ జిల్లా మొగులూరులో 43.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా ఏకంగా 17 జిల్లాల్లోని 116 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు కంటే ఎక్కువగా నమోదు అయ్యాయి. మంగళవారం ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 42 నుంచి 43.5 డిగ్రీల మధ్య నమోదవుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు.
పిడుగులను గుర్తించండిలా- మెరుపుల వేళ ఈ మెలుకువలు తప్పనిసరి!
ఇదిలా ఉండగా మరోవైపు భారత వాతావరణ శాఖ (IMD) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరుగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే రానున్న 3 రోజుల పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిస్తే, మరోవైపు వేడి గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపిన సంగతి విధితమే.
ఓ వైపు భారీ వర్షాలు- మరోవైపు వేడి గాలులు- దేశ ప్రజలకు IMD హెచ్చరిక!