IMD Rain Alert to Telangana : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం శుక్రవారం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో సగటు సముద్రమట్టం నుంచి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. రాష్ట్రంలో మూడు రోజులు పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. రాగల మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా కొనసాగే అవకాశం ఉందని వివరించారు.
తెలంగాణకు ఆనుకొని ద్రోణి ఏర్పడిందని, ఉపరితల అవర్తనం కారణంగా రాష్ట్రంలో తేమ గాలులు వీస్తున్నాయని శ్రీనివాస్ తెలిపారు. అవి వీయటం వల్ల మేఘాలు ఏర్పడి సాయంత్రం వర్షాలు పడుతున్నాయని వివరించారు. తిరిగి ఉదయం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. రాబోయే మూడు, నాలుగు రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు.
"రాజస్థాన్ నుంచి కోస్తాకు వెళ్తున్న ఉపరితల అవర్తనం కారణంగా తెలంగాణలో వానలు పడే అవకాశముంది. ఈ సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, జల్లులు పడతాయి. రాబోయే నాలుగు రోజులు కూడా గత 30 ఏళ్ల నుంచి ఉష్ణోగ్రతలకు అటుఇటుగా 1 డిగ్రీ పెరిగే అవకాశముంది." - శ్రీనివాస్, వాతావరణశాఖ అధికారి
అలా పిడుగులు ఏర్పడతాయి : ద్రోణి, ఉపరితల అవర్తనం కారణంగా తేమ గాలుల ప్రవేశించి వర్షాలు కురుస్తున్నాయన్న ఆయన వాతావరణంలోని వేడిని తగ్గించే అంత తేమ గాలులు వీయడం లేదని వివరించారు. మేఘాల్లో అనిశ్చతి ఏర్పడం, మరోవైపు తేమగాలులు నీటి బిందువులుగా ఏర్పడి, మంచుగా మారుతాయి, అప్పుడు వాటికి పాజిటివ్, నెగటివ్ ఛార్జీలు డెవలప్ అవుతాయని, దీని డిశ్చార్జీనే మెరుపు, పిడుగులు అంటారని తెలిపారు. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
తెలంగాణకు భారీ వర్ష సూచన! - ఆ జిల్లాల్లో నేడు, రేపు వడగండ్ల వానలు!!