ETV Bharat / state

సరోగసీ చట్టాలు ఏం చెబుతున్నాయి? - సృష్టి వ్యవహారం మనకు ఎలాంటి పాఠాలు నేర్పుతోంది?

సరోగసి పేరుతో శిశువుల అక్రమ రవాణా చేసిన సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం - ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారీతిన వ్యవహారం - ఇటీవల రాష్ట్రంలో సంచలనం రేపుతున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఘటన

Fertility Clinic Center
Fertility Clinic Center (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : July 28, 2025 at 7:56 PM IST

6 Min Read
Choose ETV Bharat

Illegal Surrogacy In Hyderabad : అమ్మా అనే పిలుపులో ఓ అద్భుతమైన అనుభూతి ఉంటుంది. ప్రపంచంలోని విజయా లన్ని ఓ ఎత్తు తల్లి కావడం మరో ఎత్తు అంటారు మన పెద్దలు. ఈ సృష్టిని ముందుకు తీసుకువెళ్లే శక్తి ఆ ఒక్క మాతృత్వానికే ఉంటుంది. అంతటి గొప్ప వరం అందిరికీ సొంతం కాకపోవచ్చు. అలా అని ఢీలాపడాల్సిన అవసరం లేదు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో అనేక ఆధునిక పద్ధతుల ద్వారా సంతానం పొందే అవకాశాలు ఏటికేడు పెరుగుతున్నాయి. అలాంటి కొన్ని పద్ధతులే ఇంట్రా యుటిరైన్ ఇన్ సిమినేషన్-I.U.I, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్-I.V.F, సరోగసి ఇలా అనేక పద్ధతులు.

"ఇలాంటి క్లినిక్స్​కు పిల్లలు కావాలనుకునే తల్లిదండ్రులు చాలా ఆకర్షితులవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల కంటే క్లినిక్​ వారు చాలా సులువైన దారి చూపుతున్నారు. మీరు ఇన్ని డబ్బులు ఇస్తే మీకు శిశువును అప్పగిస్తామని చెబుతున్నారు. ఇది చాలా మంది తెలియదు. రూరల్​ ప్రాంతాల నుంచి వచ్చే వారికి అసలు ఏమి తెలియదు. భారతదేశంలో కమర్షియల్ సరోగసీపై నిషేదం ఉంది" -రష్మీ పెరుమాళ్​, నార్త్​జోన్ డీసీపీ

దంపతులు వారికున్న ఆరోగ్య సమస్యల ఆధారంగా, వైద్యుల సలహా మేరకు I.U.I, I.V.F, సరోగసి వంటి పద్ధతులను అవలంభిస్తుంటారు. ఆహారంలో మార్పులు, వ్యాయామం లేకపోవటం, ఒత్తిడి కారణం ఏదైనా ఏటికేడు స్త్రీ పురుషుల్లోనూ ఇన్ ఫెర్టిలిటీ సమస్యలు పెరుగుతున్నాయి. ప్రతి 6 జంటల్లో ఒకరు ఇన్‌ ఫెర్టిలిటీ సమస్యను ఎదుర్కొంటున్నారు. మన దేశంలోనూ వారి సంఖ్య లక్షల్లో ఉంది. అమ్మానాన్న అనే పిలుపు కోసం ఏం చేయడానికైనా ఎంత కష్టానికైనా సిద్ధం అనేలా ఉంటున్నాయి పరిస్థితులు. పిల్లలు లేరు అన్న బాధ ఒకటైతే, పిల్లలు లేరా? అన్న సమాజం ప్రశ్నలు వారిని మరింత కుంగదీస్తున్నాయి.

విద్యార్థినులు, పేద మహిళల నుంచి : పిల్లలు లేని వారి అవసరాలను ఆసరాగా చేసుకుని పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలు అక్రమాలకు తెగబడుతున్నాయి. కాసులకు కక్కుర్తిపడి మాతృత్వానికి బేరసారాల వ్యాపారాన్ని జతచేస్తున్నాయి. ఇందుకు ఓ ఉదాహరణే యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం ఘటన. సాధారణంగా ఫెర్టిలిటీ కేంద్రాల్లో ఐదు, పది వేలు ఇస్తామని ఆశ చూపి విద్యార్థినులు, పేద మహిళల నుంచి అండాలు సేకరిస్తున్నారన్న ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి.

పేద మహిళలకు ఒకటి రెండు లక్షలు చెల్లించి వారిని సరోగసికి ఒప్పించిన ఘటనలు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. కానీ, ఇది అంతకు మించిన దుర్మార్గపు ఆలోచన. లక్షలకొద్దీ వసూలు చేసి అసలు ప్రొసీజరే చేయకుండా వేరే పిల్లల్ని తీసుకొచ్చి అప్పగిస్తున్నారు. ఇప్పుడు సృష్టి కేసులో ఒక దంపతుల వద్ద బాబును కొన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన కేసుల్లో అసలేం జరుగుతోంది? పిల్లల అక్రమ రవాణా ముఠాలకు, వీళ్లకు సంబంధం ఉన్న అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు పోలీసులూ అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇష్టారాజ్యంగా ఎవరికి పడితే వారికి : ఇక్కడ సమాజం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. లైసెన్స్ పూర్తయిన వైద్యురాలు చికిత్సలు చేస్తుంటే వైద్య ఆరోగ్య శాఖ మొద్దు నిద్రపోతుందా? అనే సందేహం వ్యక్తం అవుతోంది. 2సార్లు తనిఖీలు చేసినా ఆస్పత్రిలో ఎవరు లేరని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఐతే, ఇలాంటి ఫెర్టిలిటీ క్లినిక్‌లపై తరచూ ఆరోపణలు వస్తున్నా గతంలోనే డాక్టర్ నమ్రతపై కేసులు ఉన్నా మరింత కఠిన మైన చర్యలు తీసుకోకపోవటం వెనక కారణం ఏంటి? సరోగసి ద్వారా బిడ్డను కనేందుకు సోనాలీ, గోవింద్ దంపతులు అంగీకరించారు సరే మరే చట్టాల సంగతేంటి? అంటే సరోగసీకి అనేక నియమాలు ఉన్నాయి. ఫెర్టిలిటీ కేంద్రాలు ఇష్టారాజ్యంగా ఎవరికి పడితే వారికి సరోగసీ చేయటానికి వీల్లేదు.

సరోగసీ నియంత్రణ చట్టం-2021, సహాయత పునరుత్పాదక సాంకేతికత నియంత్రణ చట్టం-2021 వంటివి ఉన్నాయి. సరోగసీ నియంత్రణ చట్టం-2021 యాక్ట్‌ని 2024లో కొన్ని సవరణలు చేశారు. దీని ప్రకారం సరోగసీ ద్వారా సంతానం పొందాలనుకునే దంపతులకు పెళ్లయి ఐదేళ్లు పూర్తికావాలి. వీరికి గతంలో పిల్లలు, దత్తత తీసుకున్న సంతానం ఉండకూడదు. ఈ నిబంధనల ప్రకారం భర్తకు 26-55, భార్యకు 25-50 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. దంపతుల్లో ఒకరికి ఇన్‌ఫెర్టిలిటీ సమస్య ఉన్నట్టు జిల్లా మెడికల్‌ బోర్డు ధ్రువపత్రం తప్పకుండా తీసుకోవాలి. జన్మించిన బిడ్డ సంరక్షణ హక్కులకు మేజిస్ట్రేట్‌ అనుమతి తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి.

సరోగసీ రెగ్యులేషన్‌ యాక్ట్‌-2021 : అలాగే గర్భాన్ని అద్దెకిచ్చే మహిళకు వివాహమై ఒక బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి. సదరు మహిళ ఒకసారి మాత్రమే అద్దెగర్భం ఇవ్వాలి. అది కూడా సమీప బంధువులకు మాత్రమే ఇవ్వాలి. ప్రసవానంతరం ఆ మహిళకు 16 నెలల బీమా సౌకర్యం కల్పించాలని సరోగసీ రెగ్యులేషన్‌ యాక్ట్‌-2021లో ఉంది. దాంతోపాటు గర్భాన్ని అద్దెకు ఇచ్చిన మహిళకు, ఆమె ప్రసవించబోయే బిడ్డకు మధ్య జన్యుపరమైన బంధమేదీ ఉండదని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఓ కేసు విచారణ సందర్భంలో సరోగసీ చట్ట నిబంధనలకు సంబంధించి ఈ వివరణ ఇచ్చింది. అంటే, ఈ చట్టం ప్రకారం తన బీజకణం లేదా శుక్లధాతువు ఇచ్చే మహిళ సరోగసీ అమ్మ కాబోదని స్పష్టం చేసింది. తల్లిదండ్రులు కావాలని కోరుకుంటున్న దంపతులతో సరోగసీ విధానంలో జన్మించబోయే బిడ్డ జన్యుపరమైన బంధాన్ని కలిగి ఉండాలని తెలిపింది. భర్త వీర్యం, భార్య మాతృజీవకణాలతో రూపొందిన పిండం మరో మహిళ గర్భంలో పెరుగుతుం దని వివరించింది. భర్తతో విడిపోయిన, విధవరాలైన మహిళల విషయంలో అయితే ఆమె శుక్లధాతువును అందజేయాల్సి ఉంటుందని పేర్కొంది.

పది లక్షలు జరిమానా : అటు I.V.F క్లినిక్‌లు సైతం కొన్ని నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ యాక్ట్-A.R.Tప్రకారం లైసెన్సింగ్, చట్టబద్దమైన నిబంధనలు పాటించాలి. ప్రతి క్లినిక్, బ్యాంకు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిబంధనల బోర్డులు వాటిని నిత్యం పర్యవేక్షించాలి. మార్గదర్శకాలకు లోబడి I.V.Fలు నిర్వహించాలి. డోనార్ డేటాకు భద్రత ఉండాలి. కనీసం 25 ఏళ్ల పాటు రికార్డులను భద్రపరచాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించకుండా ఉల్లంఘనలకు పాల్పడితే తొలిసారి ఐదు నుంచి పది లక్షలు జరిమానా అదే తప్పు మళ్లీ చేస్తే 8 నుంచి 12 ఏళ్ల జైలు శిక్షణ పది నుంచి 12లక్షల జరిమానా పడే అవకాశం ఉందని చట్టాలు చెబుతున్నాయి.

సరైన లైసెన్సులు లేకుడానే కాసులకు కక్కుర్తిపడి పిల్లలు కావాలనుకునే వారికి అక్రమంగా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ నమ్రత. ఏకంగా ఏజెంట్లను నియమించుకుని మరీ గర్భవతులను గుర్తించి వారి బిడ్డను సరోగసి ద్వారా పుట్టిన బిడ్డగా నమ్మించే ప్రయత్నం చేశారంటే వారు ఈ విషయంలో ఎంత పకడ్భందీగా వ్యవహరిస్తున్నారో అర్థం అవుతుంది. గర్భిణిని హైదరాబాద్‌లో గుర్తించి విశాఖపట్నం పిలిపించి పురుడు పోసింది.

టిప్ ఆఫ్ ది ఐస్ బర్గ్ : బిడ్డను విశాఖపట్నంలోనే సోనాలీ, గోవింద్ దంపతులకు అప్పగించిన తీరు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లోనూ ఫెర్టిలిటీ కేంద్రాల తనిఖీల విషయంలో అధికారుల అలసత్వం కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. అలాంటప్పుడు సోనాలీ, గోవింద్‌ లే తొలి బాధితులని ఎలా అనుకోగలం. గతంలోనూ ఇలాంటి అక్రమాలకు పాల్పడే అవకాశం లేకపోలేదని ఇలాగే ఇది కేవలం టిప్ ఆఫ్ ది ఐస్ బర్గ్ అంటూ ఏకంగా డీసీపీ రష్మీ పెరుమాళ్ అన్న మాటలే ఈఘటన తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

కారణం ఎవరు : వ్యవస్థల్లోని లోపం, ఓ ఫర్టిలిటీ కేంద్రం అత్యాశ , మాతృత్వం కోసం లక్షలు పోసేందుకు సిద్ధపడినా తమ రక్తం కాదనుకునే కుంచిత మనస్తత్వం ఉన్న దంపతుల ఆలోచన, పెంచే స్థోమత లేక డబ్బుకోసం అమ్మతనాన్ని అమ్ముకున్న స్త్రీ మూర్తి ఇలా క్షణ క్షణం ఓ కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ కేంద్రం మాత్రమే వెలుగులోకి వచ్చింది. కానీ, ఎవ్వరికీ దొరకకుండా, నిబంధనలు పాటించకుండా చీకటిలో దాందా సాగిస్తున్న వారిపై చర్యలేవని వేలెత్తి చూపుతోందీ ఉదంతం.

సరోగసీ కాదు చైల్డ్‌ ట్రాఫికింగ్‌ - షాకింగ్​ విషయాలు వెల్లడించిన డీసీపీ రష్మీ పెరుమాళ్

మరొక వ్యక్తి వీర్యంతో ఐవీఎఫ్‌ కేసు - టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్ నిర్వాహకురాల అరెస్ట్‌