రేషన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్ - సన్న బియ్యం తీసుకోకుంటే ఏమవుతుందో తెలుసా?
రేషన్ బియ్యం తీసుకోని వారిని గుర్తించి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం - క్షేత్రస్థాయిలో సర్వే చేసి నివేదిక సమర్పించిన అధికారులు

Published : June 29, 2025 at 4:53 PM IST
Inquiry On Suspicious Ration Cards : రేషన్ బియ్యం తీసుకోనటువంటి వారి వివరాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు, రెవెన్యూశాఖ సిబ్బందితో క్షేత్రస్థాయిలో(ఫీల్డ్ లెవల్) సర్వే చేయించారు. ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్న తరుణంలోనూ కొంతమంది రేషన్ కార్డుదారులు చౌకధరల సరుకులు తీసుకోవడం లేదు. ఈ విధంగా మంచిర్యాల జిల్లాలో 1216 మంది లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించారు. వీరికి సంబంధించిన వివరాలను జిల్లా అధికారులు కేంద్రానికి నివేదిక పంపించారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం చర్యలు చేపడతామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.
మంచిర్యాల జిల్లాలో 2.23 లక్షల పైచిలుకు రేషన్ కార్డ్స్ ఉన్నాయి. కార్డుదారులకు నెలకు 4,173 మెట్రిక్ టన్నుల రైస్‌ను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. తాజాగా 3 మాసాలకు సంబంధించిన కోటా ఒకేసారి 12,518 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డీలర్లు పంపిణీ చేస్తున్నారు. ఇందులో బియ్యం తీసుకోనటువంటి 1,216 రేషన్ కార్డుదారులను అనర్హులుగా గుర్తించనున్నారు. ఒక్కో రేషన్ కార్డుదారుని ఫ్యామిలీలో సగటున 4 సభ్యులు ఉన్న 4,864 మంది అవుతారు. లబ్ధిదారులకు పంపిణీ చేసే బియ్యాన్ని అధికారులు త్వరలో కోత విధించనున్నారు.

