Hydra Excavations At Bathukamma Kunta In Amberpet : హైదరాబాద్ నగరంలో చెరువుల పునరుద్ధరణకు నడుం బిగించిన హైడ్రా ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసింది. అంబర్‌పేటలోని బతుకమ్మకుంటలో పునరుద్దరణ పనులను హైడ్రా మొదలుపెట్టగా మోకాలిలోతు తవ్వగానే నీరు ఉబికివచ్చింది. దీంతో హైడ్రా అధికారులతో పాటు స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బతుకమ్మకుంట మళ్లీ ప్రాణం పోసుకుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ పుష్పాలతో స్వాగతించారు. హైడ్రా తవ్వకాల్లో పైపులైన్ పగలడం వల్లే నీరు బయటికి వస్తోందని ప్రచారం జరిగింది. దీంతో జలమండలి అధికారులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆ స్థలాన్ని పరిశీలించారు. ఎలాంటి పైపులైన్ లేదని, పూర్తిగా భూగర్భంలో నుంచి వచ్చిన నీళ్లేనని జలమండలి అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో హైడ్రా చెరువు పునరుద్ధరణ : సుమారు 16 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన బతుకమ్మ కుంట ఆక్రమణల కారణంగా 5 ఎకరాలకు కుచించుకుపోయింది. చెరువు పరిరక్షణ కోసం హైడ్రా కోర్టులో కూడా పోరాటం చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు ఇచ్చిన ఆధారాలతో ఇటీవల బతుకమ్మకుంట పరిధిని నిర్ధరించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో హైడ్రా చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టింది.
"మాకు హెడ్ ఆఫీస్ నుంచి సమాచారం రావడంతో బతుకమ్మకుంటకు చేరుకున్నాం. ఇక్కడ వాటర్ సప్లై పైపులైన్లు లేవు. పూర్తిగా భూగర్భంలో నుంచి వచ్చిన నీళ్లే ఇవి."- జలమండలి అధికారి
"బతుకమ్మకుంట అంటే ఒక చరిత్ర. గత 20, 30 సంవత్సరాల నుంచి బతుకమ్మకుంటను కబ్జా చేశారు. ప్రజాపాలన ప్రభుత్వం వచ్చి అక్రమదారుల నుంచి విముక్తి కలిగించింది. ఈ బతుకమ్మకుంటను అభివృద్ధి చేస్తామని అధికారులు చెప్తున్నారు. ప్రజలకు ఉపయోగపడేలా తీర్చీదిద్దుతామని వారు అంటున్నారు. ఇటువంటి చర్యలు తీసుకున్నందుకు ప్రభుత్వానికి, అధికారులుక ధన్యవాదాలు చెప్తున్నాం."- స్థానికులు
చెరువుల పరిరక్షణకు హైడ్రా పిలుపు - ఈ నంబర్‌కు ఫోన్, వాట్సప్ చేస్తే చాలు
హైడ్రా అలర్ట్ : అక్కడ ప్లాట్లు కొని ఇబ్బందులు పడొద్దు : ప్రజలకు రంగనాథ్ కీలక సూచన