Hydra Destroyed Illegal Structures in peerzadiguda : అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి విరుచుకుపడింది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలకు హైడ్రా నేలమట్టం చేసింది. పోలీసు బందోబస్తు మధ్య అక్కడి ఆక్రమణలను తొలగించారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి హైడ్రా ఈ కూల్చివేతలను చేపట్టింది.
అక్రమనిర్మాణాలు కూల్చివేత : పీర్జాదిగూడ, బోడుప్పల్ పురపాలికలపై హైడ్రా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడి రోడ్లు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినప్పటికీ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు మాత్రం చోద్యం చూస్తున్నారని ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో స్పందించిన స్పందించిన రంగనాథ్ స్వయంగా ఆయా స్థలాలను పరిశీలించారు. ఈక్రమంలో ఆయన ఆదేశాలతో గురువారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్‌లోని సర్వే నంబర్లు 1, 10, 11లోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.
"ఈ స్థలం మేము కొనుగోలు చేసి ఒక సంవత్సరం అయింది. హైడ్రా వారు పొద్దున అయిదు గంటలకు సడెన్‌గా వచ్చారు. కనీసం మాకు ఎలాంటి నోటీసు కూడా ఇవ్వకుండా కూల్చుతున్నారు. వన్ సర్వే నెంబర్లోకి ఇది వస్తుందని చెప్పారు. ఆ సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉందంటున్నారు. వాళ్లే(ప్రభుత్వం) కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ కూడా చెల్లించాము. అన్ని అనుమతులు తీసుకున్నాకే కట్టుకున్నాం. సంవత్సరానికి హౌస్‌ట్యాక్స్, కరెంట్ బిల్లు నెలనెలకు కట్టించుకుంటున్నారు" - శ్రీకాంత్ రెడ్డి, సాయిశ్వర కాలనీ
ఇంటిని కట్టుకోకముందే కూలగొడుతున్నారు : 'మాకు ఊర్లో ఉన్న రెండు ఎకరాలు అమ్ముకుని వచ్చి ఒక్కగానొక్క కొడుకు కోసం ఇక్కడ స్థలాన్ని కొనుగోలు చేశాం. కష్టపడి కొనుక్కున్నాం. రేకులు వేసుకున్నాం. ఇంకా ఇంటిని కట్టుకోకముందే కూలగొడుతున్నారు. కిరాయి ఇంట్లొ ఉంటున్నాం. ఇది వరకు ఒకసారి వచ్చి కొంచెం కూలగొట్టి పోయిండ్రు. అప్పుడు ఆ జాబితాలో మా పేరు లేదని చెప్పారు.' అని ఓ వృద్ధురాలు వాపోయారు.
ఇటీవల కాలంలో అక్రమనిర్మాణాలను హైడ్రా ఉక్కుపాదంతో అణచివేస్తోంది. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి అక్రమణ జరిగినట్లు తేలితే అక్కడకు వెళ్లి విచారణ జరిపిన తరువాత కూల్చివేతలు చేపడుతున్నారు.
కోహెడ కబ్జా స్థలాన్ని సందర్శించిన హైడ్రా కమిషనర్ - అక్రమదారులపై కేసు నమోదు
గచ్చిబౌలిలో విరుచుకుపడ్డ హైడ్రా - సంధ్య కన్వెన్షన్ సెంటర్ నేలమట్టం