Hydra commissioner Ranganath On Fire Accidents : హైదరాబాద్ పాతబస్తీ గుల్జార్ హౌస్ సమీపంలో అగ్నిప్రమాదం ఒక గుణపాఠం లాంటిదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోవడం బాధాకరమన్న ఆయన పురాతన భవనాల్లో అగ్నిప్రమాద భద్రతా నిబంధనలు పాటించకపోవడం, వాటిని నిరంతరం తనిఖీ చేయకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందన్నారు. అలాంటి భవనాల్లో నిర్మాణాన్ని ఇప్పటికిప్పుడు మార్పులు చేయడం సాధ్యం కాదన్న రంగనాథ్ యజమానులు తప్పకుండా తగిన అవగాహనతో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం త్వరలోనే అగ్నిప్రమాదాల నివారణకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోందంటోని వివరించారు.
షార్ట్ సర్క్యూట్ వళ్లే అధికశాతం ప్రమాదాలు : అధికశాతం అగ్నిప్రమాదాలు షార్ట్ సర్క్యూట్ వళ్లే జరుగుతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. అందువల్ల యజమానులు తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అగ్నిప్రమాదాలన్నింటిని అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఆయన అలాంటి ఘటనలకు కారణాలేంటి అనే వాటిని విశ్లేషించాలన్నారు. పాతభవనాల్లో స్ట్రక్చరల్ మార్పులు అంత త్వరగా సాధ్యం కాకపోవచ్చని, కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు. ఈవీ వాహనాలు పెరుగుతున్నందున వాటి ఛార్జింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరమని తెలిపారు.
ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి : ప్రజలకు అగ్నిప్రమాదాలపై మరింత విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రంగనాథ్ అన్నారు. ప్రజలు, రాజకీయ పక్షాలు, అధికారులు, చట్టసభలు ఇలా అందరూ ఉమ్మడిగా దీనిపై ఒక విధానం తీసుకురావాల్సి ఉందన్నారు. ప్రముఖ పట్టణాల్లో అమల్లో ఉన్నటువంటి అగ్నిప్రమాద నివారణ చర్యలను అధ్యయనం చేయాలన్నారు. ఆదివారం జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అగ్నిమాపక సిబ్బంది అద్భుతంగా పనిచేశారన్నారు. ఏం చేస్తే మినిమం ఫైర్ సేఫీటీని మెంటైన్ చేయవచ్చనే దానిపై ఇళ్ల యజమానులు దృష్టిపెట్టాలని కోరారు.
"ఈ అగ్నిప్రమాదాల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. ఫైర్ యాక్ట్‌లో కొన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. పాత అగ్నిప్రమాద ఘటనలను అధ్యయనం చేయాల్సి ఉంది. ఈవీలు ఛార్జింగ్ చేసినప్పుడు చాలా సందర్భాల్లో ఫైర్ షార్ట్‌సర్క్యూట్ అవ్వడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. అలాంటి వాటిని లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. పాత బిల్డింగ్‌ల విషయంలో ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు తీసుకుంటాం. -"రంగనాథ్, హైడ్రా కమిషనర్
అమీన్పూర్లో జేఏసీ పేరుతో దందా! - హైడ్రా కమిషనర్ సీరియస్ వార్నింగ్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన - ఆ ఇళ్లను కూల్చబోమని స్పష్టీకరణ