Hyderabad Police Burst Prostitution Racket in City : అక్కడ పరిస్థితులు దారుణంగా మారాయి. ఇల్లు గడవటం కష్టమైంది. కుటుంబాన్ని పోషించాలి. కడుపునిండా తిండి పెట్టాలనే ఆలోచనతో ఓ యువతి ఉద్యోగం కోసం ఏజెంట్‌ను ఆశ్రయించింది. అతడి సూచనతో దేశ సరిహద్దు దాటి మహారాష్ట్రలోని పుణె చేరి నకిలీ గుర్తింపుకార్డులు సంపాదించింది. బ్యూటీపార్లర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన దళారీ మాటలు నమ్మింది. అతడు ఆమెను రూ.20 వేలకు విక్రయించి వ్యభిచార కూపంలోకి నెట్టాడు. అక్కడ ఓ మహిళ సహాయంతో తప్పించుకొని హైదరాబాద్ చేరింది. ఇక్కడా ఆ మహిళ ఆమెను అదే రొంపిలోకి నెట్టారు. ఇటీవల నగరంలో పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన ఓ బంగ్లా యువతి పరిస్థితిది.
తమ దేశంలో పూటగడవటం కష్టంగా మారిన ఎంతోమంది బంగ్లా యువతులు, మహిళలు దళారుల చేతికి చిక్కి పడుపువృత్తిలో నరకం అనుభవిస్తున్నారు. హైదరాబాద్‌లో పట్టుబడిన 20 మంది విదేశీ యువతులు ఉద్యోగం ఇప్పిస్తామంటే నమ్మి వచ్చామంటూ తెలిపారని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ముఖ్య నగరాల్లో మకాం వేసిన బంగ్లా ఏజెంట్లు పేద కుటుంబాల నిస్సహాయతను ఆసరా చేసుకొని సాగిస్తున్న దారుణాలు నగర పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. అక్కడ లభించిన సమాచారంతో ప్రధాన సూత్రదారులపై గురిపెట్టారు.
వివిధ ప్రాంతాలకు తరలిస్తూ : బంగ్లాదేశ్, ఇటు పశ్చిమ బెంగాల్‌లోని చీకటి ముఠాలు ఏజెంట్లకు కమీషన్ ఆశచూపి బంగ్లా యువతులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల ఎర వేస్తున్నారు. వారిని దొంగచాటుగా పశ్చిమబెంగాల్, త్రిపుర, అసోం చేర్చుతున్నారు. ఒక్కో యువతికి రూ.25వేల నుంచి రూ.లక్ష వరకు ధరకట్టి వ్యభిచార గృహాల నిర్వాహకులకు అప్పగిస్తున్నారు. ముంబయి, పుణె, అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు ప్రాంతాలకు యువతులను చేరవేస్తున్నారు.
యువతుల ఫొటోలను దళారులు నిర్వాహకులకు పంపుతారు. వాటిని చూశాక ఆ యువతుల ధర నిర్ణయిస్తారు. వారిని కావాల్సిన ప్రాంతాలకు చేరవేసినందుకు ఒక్కో యువతికి రూ.2-3వేలు ఏజెంట్లకు కమీషన్‌గా ఇస్తున్నారు. బ్యూటీపార్లర్లు, స్పా, హోటళ్లలో ఉద్యోగమంటూ తీసుకొస్తున్నారు. కొందర్ని స్పా కేంద్రాల నిర్వాహకులకు అప్పగిస్తున్నారు. మరికొందర్ని నగరంలో రోజుకో ప్రాంతం మార్చుతూ విటులకు సమాచారమిస్తున్నారు. నరక కూపం నుంచి కొందరు యువతులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ప్రాంతం కావటంతో ఎటు పోవాలో తెలియక తిరిగి దళారుల వద్దకే చేరుతున్నారని పోలీసు అధికారి ఆవేదన వెలిబుచ్చారు.
టెలిగ్రామ్ యాప్‌లో గుట్టుగా వ్యభిచార దందా - అదుపులో 9 మంది విదేశీ యువతులు
వలపు వల - ఉచ్చులో చిక్కి విలవిల - ప్రేమ పేరిట బాలికలపై పంజా - Men Cheating Girls in Name of Love