Telangana Rain Report : తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ప్రకటించింది. సోమవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు గంటకు 40-50 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం : బుధవారం కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు 50 నుండి 60 కి మీ వేగం కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. గత 24 గంటల్లో నికోబార్ దీవుల్లో విస్తృతంగా వర్షపాతం నమోదయ్యిందని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యాయని తెలిపింది. వచ్చే 24 గంటల్లో నికోబార్ దీవుల్లో వర్షపాతం మరింత పెరిగి, విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇందులో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో వర్షాకాలం కొనసాగనుండటంతో రేపు నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ -నికోబార్ దీవుల కొంత భాగంలో ప్రవేశించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపింది.
రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత నమోదు : దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతాల్లో దక్షిణ బంగాళాఖాతం మరికొన్ని ప్రాంతాల్లో, మొత్తం అండమాన్ -నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలో అలాగే మధ్య బంగాళాఖాతంలోని కొంత భాగంలో రుతుపవనాల మరింత పురోగతికి అనుకూలమైన పరిస్థితులు వచ్చే 4–5 రోజుల్లో ఏర్పడే అవకాశముందని తెలిపింది. ఇది వర్షాకాల ప్రవేశాన్ని సూచించే కీలకమైన దశగా పరిగణించబడుతుందని వెల్లడించింది. రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఓ వైపు భారీ వర్షాలు- మరోవైపు వేడి గాలులు- దేశ ప్రజలకు IMD హెచ్చరిక!
రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు - ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు