Hyderabad Decision To Convert Tims Into Sports Village : గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (టిమ్స్) ఆసుపత్రిని పూర్తిగా ఖాళీ చేశారు. కరోనా సమయంలో వేలాది మందికి ఈ ఆసుపత్రి సేవలందించింది. రెండు సంవత్సరాలుగా అందిస్తున్న ఓపీ సేవలనూ ఆపివేశారు. 13 అంతస్తుల ఆసుపత్రి భవనాన్ని ప్రభుత్వం తిరిగి స్పోర్ట్స్ అథారిటీకి కేటాయించింది.
కరోనా సమయంలో సేవలందించిన ఆసుపత్రి : కరోనా సమయంలో అప్పటి ప్రభుత్వం గచ్చిబౌలి స్టేడియంలో ఖాళీగా ఉన్న స్పోర్ట్స్ విలేజ్ భవనాన్ని టిమ్స్ ఆసుపత్రిగా తీర్చిదిద్దింది. 1500 పడకలతో ప్రత్యేక వార్డులు, వైద్యపరికరాలు, ఐసీయూ, వెంటిలేటర్ సదుపాయాలు ఉండేవి. రూ.15కోట్లతో యుద్ధ ప్రాతిపదికన నెలరోజుల్లో ఆసుపత్రిని సిద్ధం చేసి 2020 ఏప్రిల్ 20న ప్రారంభించారు. 24 గంటలు వైద్యులు, సిబ్బంది పని చేసి రోగులకు మెరుగైన సేవలందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు.
సిబ్బందిని ఇతర ఆసుపత్రులకు బదిలీ : కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత ఇక్కడ సాధారణ వైద్య సేవలందిస్తూ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిగా, పీజీ వైద్య విద్యా కేంద్రంగా మారుస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. 2023లో వైద్యులను, సిబ్బందిని ఇతర ఆసుపత్రులకు బదిలీ చేశారు. ఒప్పంద పద్ధతిన నియమించుకున్న సిబ్బందిని విధుల నుంచి తీసేశారు. ఖరీదైన వైద్యపరికరాల్లో కొన్నింటిని ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. తర్వాత ఇద్దరు వైద్యులు, ఇద్దరు నర్సులతో ఓపీ సేవలు కొనసాగించారు. డిసెంబర్ నుంచి అవి కూడా ఆపేశారు.
తిరిగి స్పోర్ట్స్ అథారిటీకి : ప్రపంచ మిలిటరీ గేమ్స్ సందర్భంగా క్రీడాకారుల వసతి కోసం 2007లో అప్పటి ప్రభుత్వం గేమ్స్ విలేజ్ భవనాన్ని నిర్మించింది. క్రీడలు ముగిసిన తరువాత ఈ నిర్వహణను పట్టించుకోకపోవడంతో ఖాళీగా వదిలి పెట్టారు. ఆ తర్వాత ఆసుపత్రిని రద్దు చేసి తిరిగి స్పోర్ట్స్ అథారిటీకి కేటాయించారు. అప్పటినుంచి పోటీలకు వచ్చే క్రీడాకారులకు ఈ భవనంలో వసతి ఏర్పాటు చేస్తున్నారు.
పెచ్చులూడి నీటి చెమ్మతో : నిర్వహణ లేక అధ్వానం 2023లో ఆసుపత్రి నుంచి సామగ్రిని ఇతర ఆసుపత్రులకు తరలించిన అధికారులు భవన నిర్వహణను పట్టించుకోలేదు. ఫలితంగా భవనం అధ్వానంగా తయారైంది. పెచ్చులూడి నీటి చెమ్మతో నిండిన గోడలు, విరిగిన తలుపులు, సీలింగ్, పైపులైన్ లీకేజీ, మూలనపడిన పలు యంత్రాలు, పరికరాలతో భవనం కళావిహీనంగా మారింది.
చిన్న పట్నంలో పెద్ద చికిత్స - పల్లెవాసులకీ ప్రపంచస్థాయి వైద్యం!
అమ్మ కడుపులోనే శిశువుకు శస్త్ర చికిత్స - ప్రపంచంలోనే తొలిసారిగా