ETV Bharat / state

యాచారం మీదుగా హైదరాబాద్‌ To అమరావతి జాతీయ రహదారి - 11 చోట్ల ఇంటర్‌ ఎక్స్చేంజీలు ఏర్పాటు

యాచారం మీదుగా హైదరాబాద్‌-అమరావతి జాతీయ రహదారి - 22న హైదరాబాద్‌లో సమీక్ష - 11 చోట్ల ఇంటర్‌ ఎక్స్చేంజీలు ఏర్పాటు

Hyderabad-Amaravati National Highway
Hyderabad-Amaravati National Highway (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 11, 2025 at 11:37 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad-Amaravati National Highway via Yacharam : హైదరాబాద్‌-అమరావతి జాతీయ రహదారిని తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా యాచారం మీదుగా నిర్మించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రాథమిక అంచనా రూపొందించారని ముఖ్య అధికారి ఒకరు 'న్యూస్‌టు'కు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్‌ పోర్టు వరకు 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డి మంగళవారం కోరిన విషయం తెలిసిందే. ఈ అంశంపై 22న హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహిస్తామని గడ్కరీ తెలిపినట్లు సీఎంవో ఆఫీస్​ తెలిపింది. హైదరాబాద్‌-అమరావతి నిర్మాణం ఎక్కడి నుంచి చేపడితే ప్రయోజనం ఉంటుందనే అంశంపై ఉన్నత స్థాయిలో అధికారులు ప్రతిపాదనలు చేశారు. వాటిలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ అంతరాష్ట్ర ప్రధాన రోడ్లను కలుపుతూ చేసిన ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యత తెలుస్తోంది.

11 చోట్ల ఇంటర్‌ ఎక్స్చేంజీలు ఏర్పాటు : ఓఆర్‌ఆర్‌ రావిరాల నుంచి భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి ఇప్పటికే గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మీర్‌ఖాన్‌పేట, కుర్మిద్ద ప్రాంతంలో జంక్షన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఆ జంక్షన్‌ నుంచి మల్కీజ్‌గూడెం, మేడిపల్లి, యాచారం వెనుక వైపు నుంచి నల్గొండ జిల్లా మునుగోడు, చండూరు మధ్య నుంచి జాన్‌పహడ్‌ మీదుగా నిర్మిస్తారని తెలుస్తోంది. 11 చోట్ల ఇంటర్‌ ఎక్స్చేంజీలు ఏర్పాటు చేస్తారని అధికారులు చెబుతున్నారు.

ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి అనుమతులు : తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్‌ వరకు 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల నిర్మాణం, అనుమతులు, పనుల వేగవంతంపై కూడా చర్చించారు.

''హైదరాబాద్‌ రీజినల్‌ రింగు రోడ్డు(నార్త్‌)కు కోసం 90 శాతం భూ సేకరణ పూర్తయింది. దీంతో వెంటనే ఆర్థిక, క్యాబినెట్‌ అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించండి. ఈ రింగ్‌ రోడ్డుకు సమాంతరంగా ఆర్‌ఆర్‌ఆర్‌ (సౌత్‌) పనులు చేపట్టడానికి వీలుగా అన్ని అనుమతులు మంజూరు చేయాలి. శ్రీశైలంతో హైదరాబాద్‌ను అనుసంధానించే మన్ననూర్‌-శ్రీశైలం రహదారి అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు పరిధిలో ఉంది. అందువల్ల నాలుగు వరుసల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలి. ఈ కారిడార్‌ పూర్తయితే ఏపీలోని కృష్ణపట్నం రేవుతో పాటు మార్కాపురం, కనిగిరి, కంభం, నెల్లూరులకు రాకపోకలు సులువవుతాయి. అలాగే రావిర్యాల-ఆమనగల్లు-మన్ననూర్​ నాలుగు వరుసల గ్రీన్​ఫీల్డ్​ రోడ్డు నిర్మించాలి. హైదరాబాద్‌-మంచిర్యాల మధ్య ఉన్న రాజీవ్‌ రహదారిపై వాహన రద్దీ ఎక్కువగా ఉన్నందున కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని మంజూరు చేయండి. సీఆర్‌ఐఎఫ్‌ కింద రూ.868 కోట్లతో ప్రతిపాదించిన రహదారుల పనులకు ఆమోదం తెలపండి" అని గడ్కరీకి సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తులకు గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్ - హైదరాబాద్‌ నుంచి అమరావతికి నేరుగా గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే