Husband and Wife Died in Nalgonda District : కష్టమైనా, సుఖమైనా కడదాక కలిసి బతకాలని దైవసాక్షిగా ఏడడుగులు వేశారు. చివరిదాకా ఒకరికోసం ఒకరిగా బతికారు. వారి జీవితంలో అన్నింటినీ సమానంగా స్వీకరించారు. ఒకరిని విడిచి మరొకరు అస్సలు ఉండేవారు కాదు. చివరికి కాటికి సైతం కలిసే వెళ్లారు. అన్యోన్య దాంపత్యానికి, స్వచ్ఛమైన ప్రేమకు సాక్షులుగా నిలిచారు. హృదయవిదారకమైన రెండు ఘటనలు వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి.
గుండె సంబంధిత సమస్య : స్థానికులు తెలిపిన ప్రకారం నల్గొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన దుబ్బ శంకరయ్య(67), లక్ష్మి(57) అనే దంపతులు ఉపాధి కోసం ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. శంకరయ్య అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసేవారు. పిల్లలు లేకపోవడంతో ఒక కుమారుడిని పెంచుకుంటున్నారు. శంకరయ్య కొద్ది నెలలుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ ఆదివారం హర్ట్ఎటాక్తో మృతి చెందారు. అనంతరం మృతదేహాన్ని సొంతూరు పలివెలకు తీసుకొచ్చారు.
అకస్మాత్తుగా భర్త మరణించడంతో తట్టుకోలేక లక్ష్మి తీవ్రంగా రోదించారు. సోమవారం ఉదయం భర్త మృతదేహం పక్కనే ఉన్నట్టుండి కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే లక్ష్మి ప్రాణాలు వదిలారు. ఒకరోజు వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మృతి చెందడం, ఇద్దరి అంత్యక్రియలను ఒకేచోట నిర్వహించారు. ఈ ఘటనను చూసిన గ్రామస్థులు ప్రతిఒక్కరూ కంటతడి పెట్టారు.
మరో ఘటనలో : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రామచంద్రాపురానికి చెందిన బూదాటి యశోద, హనుమారెడ్డి దంపతులది వ్యవసాయ ఆధారిత కుటుంబం. హనుమారెడ్డికి నెలరోజుల క్రిత దురదృష్టవశాత్తు చేయి విరిగింది. చికిత్స కోసం దంపతులిద్దరూ ఖమ్మంలో ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్న తమ కుమారుడు రమేశ్ ఇంటికి వెళ్లారు. ఆదివారం(ఏప్రిల్ 13) సాయంత్రం యశోద(76) అనుకోకుండా ఇంట్లో నడుస్తున్న క్రమంలో కాలు జారి కిందపడ్డారు. తల దర్వాజకు బలంగా తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
భార్య తన కళ్లముందే విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన హనుమారెడ్డి(81) బాధతో తట్టుకోలేకపోయారు. తీవ్ర ఆందోళన చెందుతూ గంట వ్యవధిలోనే గుండెపోటుతో కుప్పకూలారు. దంపతుల మృతదేహాలను స్వస్థలం రామచంద్రాపురానికి బంధువులు తరలించారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. గంట వ్యవధిలో భార్యాభర్తలు మృతిచెందారనే వార్త విన్న గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఏం జరిగింది? - భర్త ఊరెళ్లొచ్చేసరికి భార్య అలా, కుమార్తె ఇలా!