Hunters Killed Tiger with Electric Shock : ఆరేళ్లుగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తిరుగుతున్న కే-8 ఆడపులి పెంచికల్‌పేట్ మండలం ఆగర్‌గూడ గ్రామ సమీపంలోని పాత చిచ్చాల అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు అమర్చిన విద్యుత్తు తీగకు తగిలి మృత్యువాతపడింది. ఈ ఘటనలో 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సీసీఎఫ్ శాంతారాం, డీఎఫ్‌ఓ నీరజ్‌కుమార్‌లు శనివారం తెలిపారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 13న పులి కెమెరాలకు చిక్కిందని, ఆగర్‌గూడ అటవీ ప్రాంతంలో ఉన్న విద్యుత్తు లైన్‌ను తొలగించాలని పలుమార్లు సంబంధిత అధికారులకు చెప్పినా స్పందించలేదని పేర్కొన్నారు. అయితే.. సమీప గ్రామాల ప్రజలు తునికాకు సేకరణకు 15న ఉదయం అటవీ ప్రాంతానికి వెళ్లగా కిందపడి ఉన్న పులిని చూసి భయపడి వెనుదిరిగారు. దీంతో స్మగ్లర్లు పులిని దాదాపు 200 మీటర్ల వరకు మోసుకెళ్లి చర్మం, గోళ్లను తీసుకొని.. మిగిలిన కళేబరాన్ని ఒర్రెలో పాతిపెట్టారు. విషయం అటవీ అధికారులకు తెలియడంతో 16న అటవీ ప్రాంతాన్ని గాలించారు. రక్తపు మరకలు, వెంట్రుకల ఆధారంగా పులిని పాతి పెట్టిన స్థలాన్ని శనివారం ఉదయం గుర్తించారు. శరీర భాగాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
రెండు నెలల నుంచి బెజ్జూర్ మత్తడి వద్దే : కే-8 పులి రెండు నెలల నుంచి బెజ్జూరు అటవీ ప్రాంతంలోని మత్తడి వద్దే సంచరిస్తోంది. ఈ ప్రాంతం ఆగర్‌గూడ పాతచిచ్చాల అటవీ ప్రాంతానికి సుమారు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. అయితే పులి ఉనికి మత్తడి నీటి ఊటల వద్దే ఉంటుందని అనుకున్న అధికారులు ఆగర్‌గూడ పాత చిచ్చాలపై దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల కిందట ఆగర్‌గూడ అటవీ ప్రాంతానికి వచ్చిన కే-8.. వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు తీగకు తగిలి ప్రాణాలు కోల్పోయింది. 2021లో అది మూడు పిల్లలకు (కే-11, 12, 13) జన్మనిచ్చింది.