Crop Loss to Farmers Due to Heavy Rains In AP: అకాల వర్షాలతో రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మైలవరం నియోజకవర్గంలో జి. కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాలలో అధికంగా రైతులు నష్టపోయారు. మామిడి, ధాన్యం, మొక్కజొన్న, కాకర వంటి పంటలు పూర్తిగా దెబ్బతిని, లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది.
అకాల వర్షాలకు నష్టపోయిన రైతన్నలు: గాలి వాన బీభత్సం వల్ల మామిడి పండ్లు నేలరాలి పోయాయని రైతులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కనుమూరులో ఈదురు గాలులకు మామిడి కాయలు నేలరాలాయి. ఎ. కొండూరు మండలం రామచంద్రపురంలో బొప్పాయి నేల వాలింది. అనుముల్లంకలో సైతం నేలవాలిన మొక్కజొన్నను స్థానిక తెలుగుదేశం నేతలు పరిశీలించారు.
అనంతలో నేలకొరిగిన మామిడి పంట: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మోపిడి గ్రామంలో భారీ ఈదురు గాలులకు రైతు గొర్తి ఆదినారాయణ అనే రైతుకు చెందిన మామిడి పంట నేలరాలింది. దాదాపు ఐదెకరాల్లో భూమిలో అతడు మామిడి సాగు చేయగా ప్రస్తుతం పంట చేతికొచ్చింది. మరో నాలుగైదు రోజుల్లో కోయాల్సి ఉండగా ఇంతలోనే ఈదురు గాలులకు కాయలన్నీ రాలిపోవడం దురదృష్టకరం. సుమారు రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు గొర్తి ఆదినారాయణ వెల్లడించారు. ప్రభుత్వం తమను అదుకోవాలని ఆయన కోరుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో తీవ్ర పంట నష్టం: సోమవారం సాయంత్రం అకాల వర్షం, ఈదురు గాలులతో ఎన్టీఆర్ జిల్లాలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. విజయవాడ శివారు నున్న, కొత్తూరు తాడేపల్లి, రెడ్డిగూడెం, మైలవరం, ఎ.కొండూరు, తిరువూరు ప్రాంతాల్లో ఈదురు గాలులలకు మామిడి పంట దెబ్బతింది. ఎక్కువ స్థాయిలో చెట్టు నుంచి కాయలు రాలి కిందపడ్డాయి. రేపో, మాపో పంటను కోసి మార్కెట్కు తీసుకువెళ్దామని రైతులు భావించేలోపే అకాల వర్షం వారి ఆశలను నేలకూల్చింది.
అసలే ఈ ఏడాది అంతంతమాత్రంగా మామిడి దిగుబడులు రాగా, ఉన్న పంట కాస్తా వర్షార్పణమైంది. లక్షల రూపాయలు వెచ్చించి మరీ కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న మామిడి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. భారీ వర్షాలతో దెబ్బతిన్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అధికారులకు రైతులు మొర పెట్టుకుంటున్నారు.
వడగండ్ల వాన - దెబ్బతిన్న పంటలు - ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం
కౌలు రైతును నిండా ముంచిన మిగ్‌జాం తుపాను-ఉదారమంటూ ఉత్తమాటలు వల్లెవేస్తున్న సీఎం జగన్