How to Protect Your Eyes in Summer : అబ్బబ్బ, ఏం ఎండలు. కళ్లు మంట పడిపోతున్నాయంటూ ఇంట్లోకి రాగానే ప్రతి ఒక్కరూ అనే మాటే. వేసవి కాలం బయటకు వెళ్లినా, ఇంట్లో ఏదైనా అపరిశుభ్రమైన వాతావరణం ఉన్నా కంటిపై కొంత ప్రభావం పడుతుంది. అయితే వేసవి కాలంలో కళ్లను రక్షించుకోవాలి. అందుకు ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటి నుంచి ఎలా బయటపడాలనే అంశాలపై కామారెడ్డి జిల్లా బాన్సువాడ దవాఖానా కంటి వైద్య నిపుణుడు డా.విజయ భాస్కర్ కొన్ని సూచనలు చేశారు.
డా.విజయ భాస్కర్ తెలిపిన సూచనలు : -
- వేసవికాలంలో ఎండలకు ఇంట్లో కూలర్లు, ఏసీలు ఉపయోగిస్తుంటాం. వాటిని సరిగా శుభ్రం చేయకపోయినా, కొత్తవి వాడినా కంటి అలర్జీ వస్తుంది. అందుకు ఏసీలు, కూలర్లను సరిగా శుభ్రం చేయించాలి.
- ఎండలో ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు వేడికి, ఎండలో బయటకు వెళ్లలేక ఇంట్లో చాలా సేపు మొబైల్ చూసినప్పుడు కంటిలో తేమ శాతం తగ్గుతుంది. అందుకే వేసవి కాలంలో బయటకు వెళ్తే కళ్లకు కూలింగ్ గ్లాసెస్, తలపై టోపీ ధరించడం మేలు.
- పిల్లలకు రోజుకు 2 గంటలకు మించి సెల్‌ఫోన్ వినియోగానికి అనుమతించొద్దు. విద్యాపరమైన అవసరానికి ట్యాబ్ ఉపయోగిస్తే మేలు. విద్య, వినోదానికి మొబైల్ అలవాటు చేయొద్దు.
- వేసవికాలంలో చాలా మంది ఈతకు వెళ్తుంటారు. స్విమ్మింగ్‌పూల్‌లో శుభ్రం చేయడానికి బ్లీచింగ్ వాడతారు. అది కొంత మేరకు కళ్లకు ఇబ్బంది కలిగిస్తుంది. స్విమ్మింగ్‌పూల్ శుభ్రం చేయకపోయినా అపరిశుభ్ర నీటితో ఇన్‌ఫెక్షన్ వస్తుంది. అందుకే స్విమ్మింగ్‌కు వెళ్తే కంటికి గాగుల్స్ ధరించాలి. కళ్లకలక వంటి అంటువ్యాధులు సోకిన వారు ఈత కొలనుకు వెళ్లకపోవడమే మంచిది.
- వేసవికాలంలో కంటికి సంబంధించి ఏ సమస్య ఉన్నా నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈ వేసవిలో పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త - వైద్యనిపుణుల సూచనలు ఇవే
ఎండాకాలంలో ఈ ఆహారం అలవాటు చేసుకుందాం - ఆరోగ్యాన్ని కాపాడుకుందాం
ఐస్ కలిపిన జ్యూస్‌లు తాగుతున్నారా? - వెంటనే ఆపేయకుంటే ఆరోగ్యానికి ముప్పు