How to Identify Fake Seeds : రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. వీటితో సాగు చేస్తే రైతన్నలకు నష్టాలే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విత్తనాల కొనుగోలు టైంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారిణి రాధిక అంటున్నారు.
ఇప్పుడు అప్పుడప్పుడు వర్షాలు కురుస్తుండటంతో చాలామంది అన్నదాతలు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. ఐతే భారీ వాన కురిసే వరకు విత్తనాలు నాటుకోకూడదు. ముఖ్యంగా నాణ్యమైన విత్తనాలు సేకరించాలి. వీటితో సాగు చేస్తే 20 నుంచి 25 % ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. నాణ్యమైన విత్తనం అంటే జన్యుస్వచ్ఛత కలిగి ఉండటం. స్థానిక వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తే మేలు. ఏ భూములకు ఏ పంట అనుకూలమో వారిని అడిగి తెలుసుకోవాలి.
విత్తన సంచులపై ఏం ఉంటాలంటే :
- పరీక్ష చేసిన తేదీ నుంచి తొమ్మిది నెలల కాలపరిమితికి మించి ఉన్న విత్తనాన్ని కొనొద్దు.
- ఆకుపచ్చ, నీలిరంగు ట్యాగు ఉంటే విత్తనం ధ్రువీకృతమైంది.
- ఆకుపచ్చ లేబుల్ తప్పనిసరి.
- తెలుపు, ఆకుపచ్చ రంగు ట్యాగు ఉంటే మూల విత్తనం.
- తెల్ల, నీలి రంగు ట్యాగు ఉంటే అధికారి సంతకం ఉండాలి.
నాణ్యమైన విత్తనాల లక్షణాలు :
- 100 % జన్యు స్వచ్ఛత.
- 98 % బాహ్య స్వచ్ఛత.
- ఎక్కువ దిగుబడిని ఇచ్చే రకం లేదా హైబ్రిడ్ రకం.
- పంటను బట్టి 75 నుంచి 90 % మొలకెత్తే శక్తి ఉంటుంది.
- విత్తనాలలో తగినంత తేమ % ( అపరాలలో 8-9 %, ధాన్యం - 10-12 %).
- అంతర్గత చీడపీడలు లేని ఆరోగ్యకరమైనవి.
విత్తనాల కొనేటప్పుడు జాగ్రత్తలు :
- ఏ విత్తనాన్నైనా కొనుగోలు చేసేటప్పుడు గుర్తింపు పొందిన సంస్థలవే తీసుకోవాలి.
- కొనుగోలు టైంలో బిల్లుపై విక్రయదారుడి సంతకంతో పాటు విత్తన వివరాలు ఉండేలా చూడాలి.
- విత్తన సంస్థ పేరు, రకం, లాట్ నంబరు తప్పకుండా ఉండాలి.
ఎలాంటి విత్తనాలు కొనొద్దంటే :
- ఆకుపచ్చ లేబుల్ లేని విత్తనాన్ని అసలు కొనుగోలు చేయొద్దు. గడువు తేదీని చెక్ చేయాలి.
- సీలు సరిగా లేని, పాడైన లేదా చిరిగిన సంచులు తీసుకోవద్దు.
- లైసెన్స్ లేని, అపరిచిత వ్యక్తుల వద్ద విత్తనాలు కొనుగోలు చేయొద్దు.
- ప్రభుత్వ అనుమతి లేనివి అసలే కొనొద్దు.