How to Get Important Certificate To Join Higher Education : విద్యా సంవత్సరం ముగిసి వేసవి కాలం సెలవులు వచ్చేశాయి. 45 రోజుల తరువాత నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ ఫలితాలు రాగా, పదో తరగతి పరీక్షల రిజల్స్ట్ త్వరలో రానున్నాయి. ఈ దశలో గట్టెక్కిన వారంతా వివిధ కోర్సుల్లో చేరేందుకు సన్నద్ధం అవుతుంటారు. కస్తూర్బా, గురుకులాలు, ఆదర్శ విద్యాలయాల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధం అవుతున్నారు. ఇందుకు అవసరం అయ్యే ధ్రువపత్రాల కోసం ఈ సెలవుల్లో దరఖాస్తు చేసుకుంటే మంచిది.
కాలేజీల్లో చేరేవారికి : ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందే విద్యార్థులు ఒకటో తరగతి నుంచి బోనఫైడ్, టీసీ, హాల్ టికెట్, మెమోలు, ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలు, ఫొటోలు, ఆధార్ కార్డు, ర్యాంకు కార్డు, స్వీయ ధ్రువీకరణ పత్రం అందుబాటులో ఉంచుకోవాలి. వివిధ రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులు అయితే మైగ్రేషన్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి. దీన్ని పొందాలంటే చదివిన విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి.
ఎలా పొందాలంటే? : ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాల కోసం మీ సేవా కేంద్రాల ద్వారా పొందాలి. ఇందుకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బోనఫైడ్ నకళ్లతో సహా దరాఖాస్తు ఫారాలను నింపి అర్జీ పెట్టుకోవాలి.
- మెడికల్ సర్టిఫికెట్ కావాల్సిన వారు గవర్నమెంట్ డాక్టర్ నుంచి పొందాల్సి ఉంటుంది.
- గ్యాప్ సర్టిఫికెట్ కోసం మీ సేవ కేంద్రంలో ధరఖాస్తు చేసుకోవాలి. వాటికి అఫిడఫిట్, పోలీస్ క్లియరెన్స్, బోనఫైడ్‌లు సమర్పించాల్సి ఉంటుంది.
ఐదో తరగతి విద్యార్థులకు : ఇటీవల గురుకుల స్కూళ్లకు సంబంధించి టీజీసెట్ (5 నుంచి 9వ తరగతి వరకు) ఫలితాలు విడుదలయ్యాయి. సీట్లు పొందిన విద్యార్థులు సకాలంలో ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేయించుకొని రిజర్వ్ చేయించుకోవాల్సి ఉంటుంది. మెమో, టీసీ, హాల్‌టికెట్, మెడికల్ సర్టిఫికెట్, ఆదాయ, కుల, నివాస ధువపత్రాలు, ఆధార్ కార్డు, బోనఫైడ్, ఫొటోలు అందుబాటులో ఉంచుకోవాలి. నిజపత్రాలతో పాటు 3 సెట్ల నకళ్లు ఉంచుకోవాలి.
ఇవి చాలా కీలకం : ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు గురుకుల పాఠశాల, కాలేజీల్లో చేరే విద్యార్థులందరికీ ధ్రువపత్రాలు కీలకం. వీటిపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ఒక్కోసారి సకాలంలో వాటిని పొందలేకపోతే సీట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే త్వరపడి దరఖాస్తు చేసుకునేందుకు కదలాలి.
ప్రవేశ పరీక్షలకు : ఫార్మసీ, ఎప్‌సెట్, నీట్‌తో పాటు వివిధ రకాల ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు ఆ తర్వాతి కోర్సుల్లో చేరేందుకు ప్రభుత్వం నుంచి ప్రకటనలు విడుదల అవుతాయి. ఆ లోపు ప్రవేశ పరీక్ష హాల్ టికెట్, అలాట్‌మెంట్ పత్రం, ర్యాంకు కార్డు, ఒకటి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు బోనఫైడ్, మెమోలు, టీసీ, హాల్‌టికెట్, ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, ఫొటోలను సిద్ధం చేసి ఉంచుకోవాలి.
ఆదాయ ధ్రువీకరణ పత్రం లేకపోతే ఫీజు రియంబర్స్‌మెంట్‌కు అర్హులు కారు. ప్రతి సంవత్సరం దీన్ని తీసుకోవడం తప్పనిసరి. సీటు పొందినప్పుడు చెల్లించిన రుసుము రసీదునూ మన దగ్గర ఉంచుకోవాలి. చదువు మధ్యలో ఆపేస్తే గ్యాప్ పత్రం చాలా అవసరం. ఎన్‌సీసీ, క్రీడల్లో పతకాలు సాధించి ఉంటే వాటినీ సిద్ధం చేసుకోవాలి.
సెలవులను ఇలా ఉపయోగించుకుంటే - మీ భవిష్యత్తు బంగారమే!
ఫెయిల్ అయ్యామని కుంగుబాటు వద్దు - ఫలితం ఏదైనా ఓ పాఠమే జీవితంలో