New Ration Card : ఆధార్ తర్వాత అత్యంత కీలకమైన కార్డు ఏది? అంటే అందరూ చేప్పే పేరు "రేషన్ కార్డు". ఇది కేవలం రేషన్ సరుకులు మాత్రమే అందించే కార్డు కాదు. అంతకు మించి ఎన్నో రకాలుగా ఉపయోగపడే ధ్రువీకరణ పత్రం. ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికే తొలి ప్రాధాన్యం ఇస్తాయి. అలాంటి గుర్తింపును అందించే మొదటి సాధనం రేషన్ కార్డు.
కానీ, చాలా మంది అర్హులకు ఈ రేషన్ కార్డు లేదు. అలాంటి వారు తెలంగాణ సర్కారు ఎప్పుడెప్పుడు రేషన్ కార్డు జారీ చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త కార్డులకు సంబంధించి 2025 మార్గదర్శకాలను, నిబంధనలను సర్కారు వెల్లడించింది. అంతేకాదు, అర్హులైన వారందరూ రేషన్ కార్డు పొందేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొత్త కార్డు పొందడానికి ఏం చేయాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.
'అదేంటి! నా పేరు మా అత్తగారి రేషన్ కార్డుల్లో వచ్చింది' - ఆహార భద్రత కార్డుల్లో కొత్త సమస్య
దరఖాస్తు అక్కడే చేయాలి :
నూతన రేషన్ కార్డు కావాల్సిన వారు గతంలో మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయానికి వెళ్లే వారు. ఇప్పుడు కూడా చాలా మంది కొత్త కార్డుకోసం దరఖాస్తు చేసుకునేందుకు తహశీల్దార్ కార్యాలయానికే వెళ్తున్నారు. కానీ, మీసేవా కేంద్రానికి వెళ్లాలి. మీ సేవ కేంద్రంలో కేవలం రూ.45 చెల్లించి అప్లై చేసుకోవాలి. ఇంతకు మించి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కార్డు ఇప్పించాలని మధ్యవర్తులు ఎవరినీ ఆశ్రయించాల్సిన అవసరం కూడా లేదని, వారికి డబ్బులు కూడా ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల "మీ సేవ"లో దరఖాస్తు చేస్తే సరిపోతుంది. మీ సేవలో అప్లై చేసుకున్న తర్వాత సంబంధిత అధికారులు, సిబ్బంది మీ చిరునామాకు వస్తారు. మీ అర్హతా వివరాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ పరిశీలనకు వెళ్తుంది.
దరఖాస్తుకు ఏమేం కావాలి?
కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారికి తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి. కుటుంబ సభ్యులందరికీ తప్పని సరి. ఆధార్ ద్వారానే మీ స్థానికతను ధ్రువీకరించే అవకాశం ఉంది. అదేవిధంగా నివాసం కరెంటు బిల్లు, లేదంటే నీటి బిల్లు, లేదంటే గ్యాస్ కనెక్షన్ బిల్లు సమర్పించాల్సి ఉంటుంది.
రోజూ ఈ సమయాల్లో :
కొత్త రేషన్ కార్డు దరఖాస్తులను మీ సేవ కేంద్రాల్లో ప్రతిరోజూ పొద్దున 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు తీసుకుంటారు. రేషన్ కార్డు దరఖాస్తు కోసం తుది గడువును ప్రభుత్వం నిర్ణయించలేదు. కానీ, సాధ్యమైనంత త్వరగా అప్లికేషన్ చేసుకుంటేనే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.