Home Minister Anita on TTD Gosala Issue : తిరుమల గోశాలలో గోవులు చనిపోయాయన్న భూమన వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలతో టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. టీటీడీ గోశాలలో 260 మంది సిబ్బంది గోసంరక్షణ చేస్తున్నారని గుర్తుచేశారు. 2,668 ఆవులకు జియో ట్యాగ్ చేసి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
కరుణాకరరెడ్డి టీటీడీ ఖజానాను దారిమళ్లించి కమిషన్లు కొట్టేశారని మంత్రి అనిత విమర్శించారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించింది, ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్రలు చేసింది భూమననే అన్నారు. భూమన కరుణాకర్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
టీటీడీ గోశాలపై అసత్య ప్రచారం : వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. అధికారం పోయేసరికి భూమన, ఆ పార్టీ నేతలు టీటీడీ గోశాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రతపై పదే పదే వైఎస్సార్సీపీ చేసే విష ప్రచారాన్ని హిందువులు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
గతంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. పవిత్రమైన తిరుమలలో అన్యమత ప్రచారం భూమన హయాంలోనే జరిగిందని గుర్తుచేశారు. టీటీడీలో గోవుల మరణాలంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం భూమన చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయ్యాక తిరుమలలో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు.
దేవుడు చూస్తూ ఊరుకోడు : తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం మానుకోవాలని టీటీడీ పాలకమండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ హితవు పలికారు. టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయంటూ కరుణాకర్‌రెడ్డి చెప్పడం సరికాదన్నారు. కర్నూలు గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్లెల రాజశేఖర్ టీటీడీ గోశాలలో గత నాలుగు నెలల్లో వయసు మీరిన 25 ఆవులు మాత్రమే చనిపోయాయని స్పష్టం చేశారు. తిరుపతి గురించి తప్పుడు ప్రచారం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
గోవుల మృతి అంటూ వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం - మంత్రుల ఆగ్రహం
తిరుమలలో భద్రతా వైఫల్యం - శ్రీవారి మహాద్వారం వద్దకు చెప్పులతో భక్తులు