Hepatitis Cases in Konaseema District : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో హెపటైటిస్ కేసులు పెద్దఎత్తున వెలుగు చూస్తున్నాయి. 20 సంవత్సరాలకు పైబడిన వారే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రభుత్వ గణాంకాల మేరకు 180 కేసులు నమోదయ్యాయి. అందులో ప్రమాదకర హెపటైసిస్-సి బాధితులు 133 మంది ఉన్నారు.
అధికారిక లెక్కల ప్రకారం అమలాపురం, అయినవిల్లి, అల్లవరం, అంబాజీపేట, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, కొత్తపేట, పి.గన్నవరం, ఐ.పోలవరం తదితర మండలాల్లో హెపటైటిస్ బి 47 మందికి, సి 133 మందికి సోకింది. వాస్తవానికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అంచనా. ముందుగానే గుర్తించి చికిత్స అందిస్తే శరీరంలో వైరస్ ఉన్నప్పటికి కాలేయంపై ప్రభావం పడకుండా చేయొచ్చని డీఎంహెచ్‌వో ఎం. దుర్గారావు దొర పేర్కొన్నారు.
అందరూ పరీక్షలు చేయించుకోవాలని, బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. జిల్లాలో ఈ కేసుల వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసేందుకు కలెక్టర్ మహేశ్‌కుమార్ తొలుత కాట్రేనికోన మండలం పల్లం గ్రామాన్ని ఎంపిక చేశారు. అక్కడ 18 సంవత్సరాలు నిండిన సుమారు 6 వేల జనాభాలో రెండు రోజుల క్రితం వరకు 2281 మందికి ప్రాథమిక పరీక్షలు చేశారు.
16 మందికి హెపటైటిస్-బి, 9 మందికి సి నిర్ధారణ అయింది. ఈ నెల 15 నాటికి సర్వే పూర్తి చేసి, వాస్తవ పరిస్థితిని అంచనా వేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇక్కడి ఫలితాలను బట్టి ఇతర ప్రాంతాల్లోనూ సర్వే చేయనున్నారు. త్వరలోనే సామాజిక ఆసుపత్రుల్లోనూ హెపటైటిస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వివరించారు.
కోనసీమలోనే ఎందుకు? : మరోవైపు జాతీయ స్థాయిలో అస్సాం, పంజాబ్ తర్వాత కోనసీమ ప్రాంతంలోనే హెపటైటిస్ బి, సి కేసులు అధికంగా ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడి తీర ప్రాంతాల్లో మూడు దశాబ్దాలుగా ఈ వ్యాధి విస్తరిస్తోంది. అప్పట్లో స్థానిక వైద్యులు ఒకే సూదిని ఎక్కువ మందికి వినియోగించడం కూడా ఓ కారణం కావొచ్చని అధికారులు భావిస్తున్నారు.
హెపటైటిస్‌తో లివర్‌కు ముప్పు.. జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే!