Hepatitis Cases Increasing in Konaseema District : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో హెపటైటిస్ కేసులు కలకలం రేపుతున్నాయి. కాట్రేనికోన మండలంలోని తీర గ్రామం పల్లంలో 18 ఏళ్లు నిండిన వారు 6000 మంది ఉండగా తొలుత 2,281 మందికి ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. అందులో 200 మందికి హెపటైటిస్-B, మరో 65 మందికి హెపటైటిస్-C ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం పూర్తిస్థాయి పరీక్షలకు అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రికి నమూనాలు పంపించారు. అక్కడ చేసిన పరీక్షల్లో 16 మందికి హెపటైటిస్-B, 9 మందికి హెపటైటిస్-C ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త : అయితే సురక్షితం కాని లైంగిక సంబంధాలు, సరైన పరీక్షలు చేయకుండా రక్తం ఎక్కించడం, ఇంజక్షన్లు చేసేటప్పుడు ఒకే సూది పలువురికి వాడటం వల్ల ఎక్కువ మందికి ఈ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని కాట్రేనికోన పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ లిఖిత వెల్లడించారు. జ్వరం, అలసట, కామెర్లు ఉంటే ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఎం.దుర్గారావు దొర మాట్లాడుతూ, హెపటైటిస్ కేసుల విషయంలో ఆందోళన అవసరం లేదన్నారు. గ్రామంలో మరో 10 రోజుల పాటు వైద్య బృందాలు పరీక్షలు చేస్తాయని వెల్లడించారు.
కోనసీమలోనే ఎందుకు? : జాతీయ స్థాయిలో అస్సాం, పంజాబ్ తర్వాత కోనసీమ ప్రాంతంలోనే హెపటైటిస్ బి, సి కేసులు అధికంగా ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడి తీర ప్రాంతాల్లో మూడు దశాబ్దాలుగా ఈ వ్యాధి విస్తరిస్తోంది. అప్పట్లో స్థానిక వైద్యులు ఒకే సూదిని ఎక్కువ మందికి వినియోగించడం కూడా ఓ కారణం కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. పల్లం గ్రామంలో నాలుగైదు రోజుల్లో సర్వే పూర్తయ్యాక బాధితుల సంఖ్యపై స్పష్టత వస్తుందని కలెక్టర్ మహేశ్‌కుమార్ తెలిపారు.
హెపటైటిస్‌తో లివర్‌కు ముప్పు.. జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే!
హెపటైటిస్ ప్రమాదం - క్యాన్సర్‌గా మారే వరకు లక్షణాలు కనిపించవు - ఇలా అడ్డుకోవాల్సిందే!