రాష్ట్రంలో నేడు, రేపు అతి భారీ వర్షాలు - ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
తెలంగాణలో నేడు, రేపు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు - బుధ, గురువారాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం - హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక

Published : July 21, 2025 at 7:19 AM IST
|Updated : July 21, 2025 at 8:29 AM IST
Heavy Rains in Telangana : రాష్ట్రంలో నేడు, రేపు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలు మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు సహా జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. వాతావరణ శాఖ తెలిపిన నివేదిక ప్రకారం బుధ, గురువారాల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, వికారాబాద్ జిల్లా నవాబ్‌పేటలలో 10 సెం.మీటర్ల వర్షపాతం నమోదయింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం (జులై 20) అత్యధికంగా నల్లొండ జిల్లాలోని చిట్యాల మండలంలో 7.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
అడపాదడపా వానలు - విజృంభిస్తున్న జ్వరాలు : నగరంలో అడపాదడపా కురుస్తున్న వర్షాలతో వైరల్ జ్వరాలు పెరుగుతున్నాయి. గత సంవత్సరంతో పోల్చితే ప్రస్తుతం కేసులు తక్కువ నమోదు అవుతున్నప్పటికీ మలేరియా, గన్యా, డెంగీ, టైఫాయిడ్ జ్వరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రుల్లో నెమ్మదిగా రోగుల తాకిడి పెరిగింది. వాతావరణం కారణంగా ఈ మార్పులు వచ్చి వైరల్ వ్యాధుల విజృంభణకు అనుకూలంగా ఉందని, తగిన జాగ్రత్తలు పాటించాలని హైదరాబాద్ జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీహర్ష పేర్కొన్నారు.
జాగ్రత్తలు పాటించాల్సిందే :
- ఈ వర్షానికి తడవటంతో జలుబు, దగ్గు, జ్వరం, గొంతు, ఒళ్లు నొప్పులు ఉంటాయి. కానీ ఇవి 2-3 రోజుల్లో తగ్గిపోతాయి. ఒకవేళ నాలుగు రోజుల కంటే ఎక్కువగా జ్వరం కొనసాగుతున్నా కడుపు, కండరాల నొప్పులు, ఒంటిపై దద్దుర్లు తదితర లక్షణాలు ఉంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలి.
- వానా కాలంలో ఎక్కువగా తాగు నీరు, ఆహారం కలుషితమవుతుంటాయి. వాంతులు, విరేచనాలు అయితే శరీరం డీహైడ్రేడ్ అయి, సొమ్ముసిల్లి పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో నిర్లక్ష్యం చేస్తే కొన్నిసార్లు ప్రాణానికి హాని కలుగుతుంది.
- డయేరియా లక్షణాలు కన్పిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి. ఇక పిల్లల విషయానికొస్తే అసలు నిర్లక్ష్యం పనికిరాదు.
- సీజన్ మారుతున్న క్రమంలో రోగాలు మారుతాయి. దోమలతో మలేరియా, డెంగీ లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్నారు. జ్వరం మూడు రోజులు దాటితే డెంగీ, మలేరియా పరీక్షలు చేయించుకోవాలి. అలాగే జ్వరంతో పాటు కడుపులో నొప్పి, తీవ్రమైన తలనొప్పి ఉంటే టైఫాయిడ్ పరీక్షలు తప్పనిసరి.
- ఈ సమయంలో ఇంట్లో వేడిగా రెడీ చేసుకున్న ఆహారం తీసుకోవాలి. బయట ఆహారానికి దూరంగా ఉండటంతో వైరల్ జ్వరాల బారిన పడకుండా ఉండొచ్చు. కాచి చల్లార్చిన నీటిని వడబోసి తాగితే ఆరోగ్యానికి మంచిది.
- ఈ వర్షాకాలంలో దొరికే బత్తాయి, నారింజ, జామ, ఫైనాపిల్ తదితర పండ్లను తీసుకోవడంతో 'విటమిన్ సి', ఇతర వ్యాధి నిరోధక శక్తి పెంచుతాయి. కనీసం రోజుకు 6-7 గంటల పాటు నిద్ర అవసరం.
తెలంగాణలో దంచికొట్టనున్న వానలు - ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వాన - మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు

