Heat Waves At North Telangana : తెలంగాణలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మొన్నటి వరకు వర్షాలతో కాస్త తెరిపినిచ్చినా, ఉదయం నుంచి సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గరిష్ఠ ఉష్టోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉత్తర తెలంగాణలో ఈ నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకు నమోదవుతాయని వెల్లడించింది.
డేంజర్ జోన్లో ఆదిలాబాద్ : ఉత్తర తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు ఇవాళ, రేపు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 24, 25 తేదీల్లో ఉమ్మడి అదిలాబాద్‌తో పాటు నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ : ఇవాళ, రేపు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మధ్యాహ్నం వేళ ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
వచ్చే 3 రోజులు పొడిబారిన వాతావరణం ఉంటుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో 45 డిగ్రీల ఉష్టోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌కు వడగాల్పుల తీవ్రత, ఉక్కబోత అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో ఎవరూ బయటకు రాకూడదు - ధర్మరాజు, వాతావరణ శాఖ అధికారి
ఉత్తరంలో ఇంకా భయానకం : తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగాలులు వీయనున్నట్లు భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య భారతదేశంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో దక్షిణ ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణా, విదర్భ ప్రాంతాలు ఉన్నాయి. వీటికి ఏప్రిల్ 25 వరకు ఎల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.