HEART SHAPED MANGO: అసలు మామిడిని ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా? ఎప్పుడెప్పుడు వేసవి వస్తుందా, మామిడి పండ్లు తిందామా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. వివిధ రకాల మామిడి పండ్లను జుర్రుకుని తింటూ, 'ఐ లవ్ మ్యాంగో' అంటూ చెప్తుంటారు. మీరు ఐ లవ్ యూ చెప్తున్నారు సరే, మరి మామిడికాయలకు హృదయం అనేది ఉంటుందా? అవి కూడా ప్రేమను చూపిస్తాయా? ఏమో, చిత్తూరు జిల్లాలోని ఈ మామిడికాయను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అచ్చం హార్ట్ ఆకృతితో చూపరులను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడికాయలు సాధారణంగా ఏ ఆకృతిలో ఉంటుందో మనకు తెలుసు. అయితే చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని మడుపోలూరుకు చెందిన ఓ రైతు తోటలో వింత ఆకారంలో మామిడి కాయలు కాశాయి. ఒకటి గుండె ఆకారంలో (హార్ట్ షేప్) ఉండగా మరో కాయ జీడిమామిడి గింజ ఆకారంలో ఉంది. ఈ కాయలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని, వీటిని చూస్తుంటే తమకు 'ఐ లవ్ యూ' చెప్తున్నట్లు ఉందని పలువురు యువకులు, రైతులు సరదాగా అనుకుంటున్నారు. వివిధ రకాల ఆకృతులలో ఉన్న మామిడి కాయల గురించి మండల ఉద్యానశాఖ అధికారిణి సాగరిక స్పందించారు. జన్యుపర లోపాలతోనే మామిడి కాయలు ఈ విధంగా ఉంటాయని అన్నారు.

మామిడిలో ఎన్నో రకాలు: పండ్లలో రారాజు అని మామిడి అంటారు. తియ్యటి మామిడి పండ్లను జుర్రుకుని తింటుంటే, ఆ ఫీల్ మాటల్లో వర్ణించలేనిది. మామిడిపండ్ల రుచిని తలుచుకుంటేనే మనకు నోరూరిపోతూ ఉంటుంది. మామిడి పండును ఒక్కొక్కరు ఒక్కోలా ఆస్వాదిస్తుంటారు. అయితే ఎవరూ కూడా తినడానికి ‘నో’ అని చెప్పలేని పండు మాత్రం మామిడే! అందుకేనేమో, నోటికి పసందుగా, మనసు దోచేస్తూ మరెన్నో వెరైటీలతో మ్యాంగో వచ్చేస్తోంది.
సాధారణంగా మనకు తెలిసిన మామిడి పండ్లు, రసాలు, బంగినపల్లి, ఆల్ఫాన్సో, ఇలా ఏవైనా సరే, ఎక్కువగా పసుపు రంగులోనే కనిపిస్తాయి. కానీ ప్రస్తుతం నలుపు, తెలుపు, నీలం ఇలా పలు రంగులలో మామిడి పండ్లు దొరుకుతున్నాయి. ఈ రంగురంగుల మామిడి పండ్లు భారత్లో తక్కువగా ఉన్నప్పటికీ, థాయ్‌లాండ్, ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో మాత్రం అధికంగా కనిపిస్తుంటాయి. అదే విధంగా మామిడితో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. మామిడిని చాలామంది ఒక అద్భుతమైన ఆహారంగా పరిగణిస్తారు.
మామిడి చెట్టుకు సొరకాయలు! - మరోచోట దర్శనమిచ్చిన అరుదైన పుట్టగొడుగు