Health Minister Satyakumar Yadav On Covid Cases: రాష్ట్ర వ్యాప్తంగా విశాఖలో ఒక కోవిడ్ కేసు మాత్రమే నమోదైందని వైద్యారోగ్యా శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అలానే కోవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళగిరి ఏపీఐసీసీ భవనంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో కోవిడ్, సీజనల్ వ్యాధులపై సమావేశం నిర్వహించారు. అలానే అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ప్రజలు కోవిడ్‌పై భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.
కోవిడ్ సోకిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఇంటి వద్ద క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. కోవిడ్ సోకిన వ్యక్తి విదేశాలలో పర్యటించలేదని ఎలా కోవిడ్ వచ్చిందనే అంశంపై ఆరా తీస్తున్నామని తెలిపారు. సమీక్షలో వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండ్యన్,సెకండరీ హెల్త్ డైరక్టర్ డా. సిరి, ఆరోగ్యశ్రీ సీఈవోతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విమ్స్‌లో కొవిడ్ వార్డు: కొవిడ్ మహమ్మారి రూపాంతరం చెంది పలు వేరియంట్లుగా మళ్లీ వెలుగుచూస్తున్న వేళ విమ్స్ (విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ), కేజీహెచ్‌లలో బాధితుల కోసం వార్డులు ఏర్పాటు చేసినట్లు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. రాంబాబు, కేజీహెచ్ వైద్యులు తెలిపారు. విశాఖ నగరంలో ఒక కేసు నమోదు కావడంతో విమ్స్, కేజీహెచ్‌లలో 20 పడకల చొప్పున ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి, వైద్యులు, సహాయ సిబ్బందినీ కేటాయించామన్నారు.
పీపీ కిట్లు, అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేస్తామని, పాజిటివ్ వస్తే నమూనాలను ఆర్టీపీసీఆర్ పరీక్షలకు పంపిస్తామన్నారు. ప్రజలు సామూహిక ప్రదేశాలకు వెళ్లడం తగ్గించాలన్నారు. మాస్కులు, శానిటైజర్ వాడాలన్నారు.
జాగ్రత్తలు తీసుకోండి: అయితే దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరగుతున్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కేసులు పెరగడంతో అందరిలో కలవరం మెుదలైంది. తాజాగా వెలుగు చూసిన కేసులు ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. కరోనా సోకిన వారిలో మెడ, తలనొప్పి, ఒళ్లు, కీళ్ల నొప్పులు, న్యుమోనియో లక్షణాలతో ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు వివరించారు . ప్రతిఒక్కరూ తప్పక మాస్క్ ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. అనుమానం ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.