వృద్ధాప్యంలో పిల్లలు పట్టించుకోవట్లేదా? - కుంగిపోకుండా మీరూ వీళ్లలా చేయండి!
హైదరాబాద్ జిల్లాలో సుమారు 10 లక్షల మంది వయోవృద్ధులు - 2036 నాటికి వృద్ధులు 17 శాతానికి పెరిగే అవకాశముందంటున్న నివేదికలు

Published : June 15, 2025 at 2:10 PM IST
Harassment to Senior Citizens Telangana : వృద్ధాప్యం మరో బాల్యం అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. పసిపిల్లలను ఎలా కంటికి రెప్పలా చూసుకుంటామో వారినీ అలానే చూసుకోవాలి. ప్రస్తుత తరుణంలో వృద్ధాప్యం మోయలేని భారంగా మారింది. అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులనే కొందరు భారంగా భావిస్తున్నారు. వారి ఆస్తులను రాయించుకుని వదిలిపోతున్నారు. దీంతో కొంతమంది తల్లిదండ్రులు ఆస్తిని అనాథాశ్రమాలకు రాస్తున్నారు. నిత్యం అవమానాలు ఎదుర్కొంటూ మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారు.
సుమారు 10 లక్షలు మంది : 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో సుమారు 10 లక్షల మంది వయోవృద్ధులు ఉన్నారు. వీరు నగరంలోని ప్రజల్లో 11.27 శాతంగా ఉన్నారు. అయితే 2036 నాటికి వృద్ధలు 15 నుంచి 17 శాతానికి పెరిగే అవకాశం ఉందని పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి.
"నాకు ఒక కుమార్తె. అల్లారుముద్దుగా పెంచా. పై చదువులు చదువుకుని ఊరి నుంచి దూరంగా వెళ్లి ఉద్యోగం సంపాదించుకుని మమ్మల్ని మరిచిపోయింది. నా భర్త చనిపోయిన తర్వాత కుమార్తె వద్దకు వెళ్తే, నిన్ను ఎవరు చూసుకుంటారు. నువ్వే బతుకు అని అనడంతో నాకు చనిపోవాలనిపించింది. తర్వాత వాళ్ల కోసం నేనెందుకు చావాలని ఆలోచించా. వృద్ధాశ్రమంలో ఉంటూ జీవితం గడుపుతున్నా." - నాగమ్మ
వృద్ధాశ్రమం ఏర్పాటు : ఆమె పేరు భ్రమరాంబ. పాలిటెక్నిక్ వరకు చదువుకున్నారు. చిన్న ఉద్యోగం చేస్తూ కుమారుడు, నలుగురు కుమార్తెలను పెంచారు. అందరికీ పెళ్లిళ్లు చేశారు. కొన్నేళ్ల క్రితం ఆమె కుమారుడు మృతి చెందాడు. ఆ బాధతో ఆమె ఉద్యోగం మానేశారు. ఆ తర్వాత ఆమె కోడలు వేరుగా ఉండమని చెప్పింది. అప్పటి నుంచి తనలాగా ఇబ్బందులు పడుతున్న వృద్ధులతో ఓ ఆశ్రమం నడుపుతున్నారామె.
క్షమించరాని నేరం : 'చిన్నప్పటి నుంచి పిల్లల ఆలనాపాలనా చూసుకుని, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు ఎంతో కృషి చేస్తారు. అలాంటి వారిని వేధింపులకు గురిచేయడం అత్యంత బాధాకరం. కన్న తల్లిదండ్రులను చూసుకునే బాధ్యతను అనవసర ఖర్చుగా భావించడం క్షమించరాని నేరం.' అని రాష్ట్ర ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహరావు తెలిపారు.
వేధింపులకు గురి చేస్తే : హెల్ప్ ఏజ్ ఇండియా వయోవృద్ధుల సహాయ కేంద్రం, హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం, బంజారాహిల్స్. హెల్ప్‌లైన్ నంబర్ 1800 1801 253 కు ఫిర్యాదు చేయండి.
కన్నబిడ్డల కాఠిన్యం - మలి సంధ్యలో ఆనాథలవుతున్న అమ్మనాన్నలు
మీ ఇంట్లో వృద్ధులు ఉన్నారా ? - వారి అవసరాలు తీరేలా ఇంటిని తీర్చిదిద్దుకోండిలా!

