Handloom Workers not getting Mudra Loans: పేద వర్గాల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రకటిస్తున్నా వాటి అమలుకు బాలారిష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ రుణాల విషయంలో బ్యాంకర్లు అనుసరిస్తున వైఖరి పేద లబ్ధిదారులకు శాపంగా మారుతోంది. ఇందుకు జిల్లాలో ముద్ర రుణాల మంజూరు తీరే తార్కాణం.
రూ.2.63 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం: కృష్ణా జిల్లాలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. యావత్ కుటుంబం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉండే నేత కార్మికులను ఆదుకునే క్రమంలో కేంద్రం ప్రధాన మంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై)లో సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ పథకం ద్వారా 2024-25లో రూ.2.63 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మొత్తం 37 చేనేత సహకారం సంఘాల్లో పని చేస్తున్న దాదాపు 5,000 మందికి పైగా కార్మికుల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకునేందుకు అర్హులైన ఒక్కో కార్మికునికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకూ ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాలు మంజూరు చేయాలి.
ఉచిత విద్యుత్‌కు లైన్ క్లియర్ - జిల్లాల వారిగా చేనేత కుటుంబాల లెక్కలపై అధికారుల దృష్టి
బ్యాంకర్లు మంజూరు చేసిన రుణంలో లబ్ధిదారులు గరిష్ఠంగా రూ.25,000 వరకు కేంద్ర ప్రభుత్వ రాయితీ పొందవచ్చు. ఈ పథకం కోసం జిల్లాలో 856 మంది దరఖాస్తు చేసుకోగా కనీసం 20 శాతం మందికి కూడా లబ్ధి చేకూరలేదు. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి లక్ష్యంలో 50 శాతం రుణాలు కూడా మంజూరు చేయకపోవడం గమనార్హం.
రుణాలు ఇచ్చేందుకు విముఖత: ఎటువంటి పూచీకత్తులు లేకుండా ముద్ర రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. బ్యాంకర్లు మాత్రం అందుకు భిన్నంగా సిబిల్ స్కోర్, ఇతర నిబంధనలు చూపిస్తూ రుణాలు ఇచ్చేందుకు విముఖత చూపుతున్నారు. ఏదైనా ష్యూరిటీ చూపాలని కోరుతుండడంతో అర్హతలున్న పలువురి రుణ ఆశలు అడియాశలే అవుతున్నాయి. ఈ ఏడాదైనా జిల్లా ఉన్నతాధికారులు వార్షిక లక్ష్య పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి అర్హులైన వారికి రుణాలు మంజూరు చేస్తే ఫలితం ఉంటుంది.
నెలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ - అంతకుమించి వాడినా రాయితీ
మూగబోయిన మగ్గానికి మంచి రోజులు - నేతన్నల జీవితాల్లో మార్పు కోసం 'చేనేత శాల'