Guntur Railway Division Freight Load : సరకు రవాణా వ్యవస్థలో రైల్వేల పాత్ర అత్యంత కీలకం. వాటికి అత్యధిక ఆదాయం వచ్చేది కూడా ఈ మార్గం ద్వారానే. అందుకే గుంటూరు రైల్వే డివిజన్ వీటిపై ప్రత్యేక దృష్టి సారించింది. గతిశక్తి టెర్మినళ్ల ద్వారా అధిక మొత్తంలో సరకు రవాణా చేస్తోంది. 2023-2024లో 3.364 మిలియన్ టన్నుల సరకులు రవాణా చేసి గత రికార్డులను అధిగమించింది. ఈ ఏడాది 2024-2025లో 3.451 మిలియన్ టన్నులు లోడ్ చేసి ఆ రికార్డునూ దాటేసింది. 2003 ఏప్రిల్ 1న గుంటూరు రైల్వే డివిజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఉన్న రికార్డులన్నింటిని తిరగరాస్తూ దక్షిణ మధ్య రైల్వేలోనే ప్రత్యేకత చాటుకుంటుంది.
మరి రికార్డు స్థాయిలో సరకు రవాణా ఎలా సాధ్యమవుతోంది? తయారీదారులు, వ్యాపారవేత్తలు సరకులను రైల్వే ద్వారా రవాణా చేసేందుకు ఆసక్తి చూపించడం కోసం అధికారులు చేపట్టిన వినూత్న చర్యలేంటో గుంటూరు డీఆర్ఎం రామకృష్ణ మాటల్లోనే విందాం. మరోవైపు గుంటూరు డివిజన్లలో కొత్తగా మూడు గతిశక్తి కార్గో టర్మినల్స్ నిర్మించడంతో అదనంగా లోడింగ్ చేయగలుగున్నారు. అతి తక్కువ సమయానికి సురక్షితంగా సరకు చేరవేస్తుండటంతో వ్యాపారవేత్తలకు బాగా నమ్మకం కుదిరింది.
"3.451 మిలియన్ టన్నులు లోడింగ్ చేశాం. 2023-2024లో 3.364 మిలియన్ టన్నులు లోడింగ్ చేశాం. సిమెంట్, క్లింకర్, కంటైనర్ లోడింగ్ ఎక్కువ కావడం వల్లే ఇదంతా జరిగింది. ఇందుకు మాకు చాలా సంతోషంగా సంతోషంగా ఉంది. తక్కువ సమయంలోనే సురక్షితంగా సరకు రవాణా చేస్తున్నాం." - రామకృష్ణ, డీఆర్‌ఎం
వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాకు అనుకూలంగా ఉండటం రోడ్డు మార్గం కంటే తక్కువ ధరకే సరకు రవాణా చేయడం మరో ప్లస్ పాయింట్. రైల్వే ఉన్నతాధికారుల సూచనల మేరకు వినూత్న ఆలోచనలతో, ఎప్పటికప్పుడు సత్వర నిర్ణయాలు తీసుకుంటామని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందుకే దీనికి ఆదరణ బాగా పెరిగిందని వివరిస్తున్నారు. అధికారులు, సిబ్బంది, కార్మికులతో సమన్వయం చేసుకుని నిర్ణీత ప్రతిపాదనలతో పటిష్ట ప్రణాళికలతో ముందుకు సాగడంతో రికార్డు స్థాయిలో సరుకు రవాణా సాధ్యమైందని చెబుతున్నారు.
SCR New Records in Freight Load : అయితే రైల్వే అధికారులు లారీల నుంచి గూడ్స్ బండ్లలోకి సరుకు లోడ్ చేసే కూలీలకు అవసరమైన కనీస సౌకర్యాలు, వసతుల మీద దృష్టి సారిస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని కూలీలు అంటున్నారు. ఎండకు, వానకు ఇబ్బందులు పడుతూనే లోడింగ్ చేస్తున్నట్లు వాపోతున్నారు. కనీసం నిల్చొనేందుకు కూడా నీడ లేక పోవడంతో ఖాళీ సమయాల్లో గూడ్స్ పట్టాలపైనే కూలీలు సేద తీరుతున్నట్లు చెబుతున్నారు.
అటు వ్యాపారులు సైతం లోడింగ్‌కు 8 గంటలే కాకుండా మరికొంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య కారణంగా లారీలు ఆలస్యంగా రావడంతో అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తోందని అంటున్నారు. అధికారులు ఈ విషయంపై దృష్టి సారిస్తే సరకు రవాణాకు మరికొంతమంది ముందుకు వస్తారని వ్యాపారులు చెబుతున్నారు.
సరకు రవాణాలో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు: ఛైర్మన్ అంగముత్తు - VISAKHAPATNAM PORT
మ్యాంగో మార్కెట్ వెలవెల - కోతలు ప్రారంభమైనా మార్కెట్‌కు చేరని సరకు