GUINNESS RECORD WITH KUCHIPUDI: భారతీయ సంస్కృతిలో కూచిపూడి నాట్యానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. భారతీయ సంప్రదాయాలపై అమితమైన మక్కువతో కాళ్లకు గజ్జెలు కట్టి, కళాభిమానుల హృదయ ఫలకాలపై అందెల రవళి మోగిస్తున్నారు ఆ ఇద్దరు బాలికలు. అసమాన్యమైన తమ ప్రదర్శనలతో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. వారు పోటీలో దిగితే ప్రాంతం ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా సరే తమ నృత్యంతో జయకేతనం ఎగురవేస్తున్నారు. కూచిపూడిలో పతకాల పంట పండిస్తున్నారు. వేలాది మందితో పోటీ పడి మరీ ఉత్తమ ప్రతిభతో గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
నరసాపురం టు అమెరికా: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన సోమిశెట్టి ఈప్సిత 1వ తరగతి నుంచి కూచిపూడి నృత్యం నేర్చుకుంటోంది. 4వ తరగతిలో ఉండగా తండ్రి నాగరాజు ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లారు. అమెరికాలో కూడా అమ్మ బాలభాస్కరి ప్రోత్సాహంతో నాట్యంపై తనకున్న మక్కువ తీర్చుకుంటోంది. నరసాపురంలోని తమ గురువు వలవల అనంతలక్ష్మి ద్వారా అమెరికాలో ఉంటూనే ఆన్‌లైన్‌లో ప్రాక్టీస్ చేస్తోంది. అమెరికాలోని టెక్సాస్, బూస్టన్ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రదర్శనలు ఇచ్చింది. ఆన్‌లైన్ ద్వారా కాశీలో నిర్వహించిన కూచిపూడి నృత్య పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది.
అందెల సవ్వడితో అలరిస్తోన్న అమృత వర్షిణి: అదే విధంగా ఏలూరు జిల్లా కలిదిండి మండలం కోరుకొల్లుకు చెందిన శీర్ల మోహన అమృత వర్షిణి సైతం కూచిపూడిలో అందెల సవ్వడితో అలరిస్తోంది. ఆమె తల్లిదండ్రులు రామోజీ, రమాజ్యోతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో స్థిరపడినప్పటికీ నాట్యంపై తనకున్న మక్కువతో ప్రాక్టీస్ కొనసాగిస్తోంది.

ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమృత గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించాలన్న పట్టుదలతో తనలోని ప్రతిభకు మరింత సానబెట్టింది. గురువు గుండుపల్లి వేదపవన్ పర్యవేక్షణలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో 4218 మందితో పోటీ పడి మరీ ప్రతిభ చూపి తన కలను సాకారం చేసుకుంది. గిన్నిస్ బుక్‌లో అమృత వర్షిణి స్థానం సంపాదించుకుంది.
కూచిపూడిలో ప్రపంచ రికార్డు, బీటెక్‌లో సాప్ట్‌వేర్ కొలువు - అదరగొడుతోన్న యువతి
200 పైగా ప్రదర్శనలు - కూచిపూడి నృత్యంతో ఆకట్టుకుంటున్న ప్రీతిశ్రీ